Let's talk: editor@tmv.in
బీహార్‌లో పాత మేనిఫెస్టోలో కొత్త పథకాలు

బీహార్‌లో పాత మేనిఫెస్టోలో కొత్త పథకాలు

Pinjari Chand
24 అక్టోబర్, 2025

బీహార్ రాజకీయాల్లో మరోసారి హామీల హడావిడి మొదలైంది. ఎన్నికల్లో ఎక్కడ వెనకబడిపోతామోననే భయంతో ప్రతి పార్టీ సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కొత్త వాగ్దానాలు, కొంగొత్త కలలు, కొత్త పథకాలతో ప్రజల ముందుకు వచ్చే నాయకులు ఎన్నికల తర్వాత ఆ మాటలను గాలికి వదిలేస్తున్నారు. అయినా వారి మాటల గారడీలు వినటానికి, నమ్మటానికి, ఆ వాగ్దానాలపై విశ్వాసం ఉంచుతూ మరలా ఓటు వేయటానికి బీహార్ ఓటరు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడే కాదు ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి. మళ్లీ మళ్లీ మోసపోవడానికి ముందుకువస్తున్నాడు. గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేకున్నా, కొత్త పథకాలపై ప్రజలు ఆశలు పెంచుకుంటున్నారు. సుమారు 20 సంవత్సారాలుగా అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ అనేక వాగ్ధానాలు గుప్పించారు. వాటిలో కొంత మాత్రమే నేరవేరాయి. ఇప్పటికీ ఆ హామీలనే ఆయా పార్టీలు ఇస్తున్నాయంటే ఆ హామీలు ఎంతమేర నేరవేరయనేది ఇట్టే అర్థం అవుతుంది.

2020 సంవత్సరం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్గానాలు

2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమిలోని జేడీయూతో కలిసి బీజేపీ మేనిఫెస్టోను 'సంకల్ప్ పత్ర' పేరుతో విడుదల చేసింది. ముఖ్యమైన హామీలను ప్రజలకు అందించింది. ఈ మేనిఫెస్టోలోని కొన్ని హామీలు ఈ విధంగా ఉన్నాయి.

నిరుద్యోగం: సుమారు ప్రభుత్వం 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనిలో ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ హామీ నిరుద్యోగ యువతను ఆకట్టుకుంది. కానీ కేవలం 2.50 లక్షల ఉద్యోగాలను విద్యాశాఖలో భర్తీ చేసింది. ఇప్పటికీ ఈ హామీకి ఎన్నికల మేనిఫెస్టోలో చోటు దక్కుతూనే ఉంది. నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెబుతూనే ఉన్నారు. నిరుద్యోగం ప్రధాన సమస్యగా పట్టి పీడిస్తోంది.

కోవిడ్ వ్యాక్సిన్: బిహార్‌లోని ప్రజలందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చింది. 13.98 కోట్లకి పైగా డోసుల వ్యాక్సిన్ లు ప్రజలకు ఉచితంగా అందజేసింది.

వ్యవసాయ రంగం: రైతులకు అధిక ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. కొత్త రైతు చట్టాలను అమలు చేసి, రైతులకు మరింత ఆదాయాన్ని కల్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

విద్య,వైద్యం: అందరికీ మెరుగైన విద్య,వైద్య సదుపాయాలను అందించడానికి చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొంది. కొత్త పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించడంతో పాటు, ఉన్నవాటిని మరింత ఆధునీకరిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా 2.50 లక్షల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసింది.

మహిళా సాధికారత: మహిళల భద్రతకు, సాధికారతకు ప్రాధాన్యత ఇస్తామని, మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచుతామని తెలిపింది. అయితే కొంతమేర స్యయం ఉపాధి సంఘాలను ఏర్పాటు చేసింది. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్​ గార్ యోజన’ ను ప్రారంభించి అందులో భాగంగా ప్రతి కుటుంబంలో ఒకరికి ఇలా 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేలను వారి ఖాతాల్లో జమ చేసింది.

మౌలిక సదుపాయాలు: గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరాను మెరుగుపరచడం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది. అయితే విద్యుత్ వ్యవస్థను గణనీయంగా మెరుగుపరిచినప్పటికీ, గ్రామీణ, రోడ్ల అభివృద్దిలో నేటికీ పురోగతి సాధించలేదు. బీహార్‌లో వస్త్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు తదితర ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించలేదు. నేటీకి ప్రతి రాష్ట్రంలో బీహారీలు ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు వలసపోతూనే ఉన్నారు.

ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని హామీలు కొంతమేర నెరవేరగా, కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కొంతవరకు పురోగతి కనిపించింది. కానీ నిరుద్యోగ హామీ పూర్తిగా నెరవేరనేలేదనే విమర్శలు ఉన్నాయి.

ప్రస్తుతం ఎన్డీయే ఇస్తున్న హామీలు

ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజననుఇప్పటికే ప్రకటించింది. ఉచిత విద్యుత్ , పెన్షన్లు పెంచడం, నిరుద్యోగ భృతి వంటి పథకాలు తీసుకొస్తుంది. అలాగే ప్రధానమంత్రి ముద్ర యోజన లాంటి స్వయం ఉపాధి పథకాలను కేంద్ర బీహార్‌లో వేగంగా అమలుచేస్తోంది.

ఆర్జేడీ ఇస్తున్న హామీలు

బీహార్లో ఎన్నికల ప్రచారంలో హామీలు ప్రధాన రాజకీయ ఆయుధంగా మారాయి. తమ ప్రభుత్వం వస్తే ఒక్కో ఇంటికి ఉద్యోగం, మహిళలకు నెలకు మా బెహన్, మా యోజన పథకంలో భాగంగా రూ.2,500 భృతి, వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ రూ.400 నుంచి రూ.1,500 గా పెంచుతామని హామీ, ప్రతి కుటుంబానికి 200 వరకు ఉచిత విద్యుత్ యూనిట్లు, జీవిక దీదీ పథకం కింద మహిళలకు రూ.30 వేల జీతం, కాంట్రాక్ట్​ ఉద్యోగాల పర్మినెంట్ వంటి హామీలు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటిస్తున్నారు. అయితే వీటన్నింటిని నేరవేర్చడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోదనే వాదనలు ఓ వైపు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర బడ్జెట్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ3,16,895.02ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సుమారు 2.9 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్ రూ. 29 కోట్లకు చేరాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతమున్న దానికంటే దాదాపు 9 రెట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దేశ ఆర్థిక వేత్తలు చెబుతున్నట్లుగా బీహార్ బడ్జెట్‌లో ఈ రకమైన హామీలకు అవసరమైన నిధులు లేకపోవడం వల్ల అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని వాపోయారు.

కొత్తగా ఏర్పడిన జన్ సురాజ్ పార్టీ కూడా సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, మహిళలకు స్వయం ఉపాధి కింద రుణాలు ఇస్తామని, స్థానికంగానే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఇస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెబుతోంది.

రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో మారింది మాటలే. కానీ రాష్ట్రంలో పరిస్థితులు పెద్దగా మారలేదు. ప్రతి ఎన్నికల తర్వాత హామీలు మరచిపోయినట్లు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి కొత్త ప్యాకేజ్ తో రాజకీయ పార్టీలు ఓటర్ల ముందుకు వస్తూనే ఉన్నాయి. ఇలా హామీల చక్రం బీహార్‌లో కొనసాగుతూనే ఉంది. ఒక్కొసారి నాయకులు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెబుతారు. కానీ మా గ్రామంలో ఇప్పటికీ రోడ్డు లేదు, దవాఖాన లేదు. ప్రతి ఎన్నికల్లో మహిళల కోసం కొత్త హామీలు ఇస్తూనే ఉంటారు. కానీ కళాశాలకి సరిగా బస్సులు కూడా లేవు. మాకు హామీలు కాదు, అవకాశాలు కావాలని బీహార్ వాసులు కోరుతున్నారు. పరిమిత అవకాశాలు, నిరుద్యోగం, వలసలు వంటి సమస్యలు వేధిస్తున్నా, ప్రజలు ఆయా పార్టీలపై నమ్మకం ఉంచుతున్నారు. ఇది బీహార్ ప్రజాస్వామ్యంలో అపూర్వమైన విశ్వాసం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీహార్‌లో పాత మేనిఫెస్టోలో కొత్త పథకాలు - Tholi Paluku