Let's talk: editor@tmv.in
బీహార్‌లో దళిత వ్యతిరేక ప్రభుత్వం

బీహార్‌లో దళిత వ్యతిరేక ప్రభుత్వం

Aravind Maryada Reddy
29 సెప్టెంబర్, 2025

బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. మహా‌ఘట్ బంధన్ కూటమి దళితులు, మైనార్టీలు, బీసీ వర్గాల ఓట్లను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చాలా రోజులుగా రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. బీజేపీ వ్యతిరేక వర్గాల ఓట్లను ఈసీ ఉద్దేశ్యపూర్వకంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం అదే తరహాలో ఎన్డీయే కూటమిపై విమర్శలు గుప్పించారు. బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో దళితులకు అవకాశాలు దక్కడం లేదని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ విధానాలను బీహార్‌లో అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 21.3 శాతం కంటే ఎక్కువ ఉన్నప్పటికీ వారికి ఆ స్థాయిలో అవకాశాలు దక్కడం లేదని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. వారికి కేవలం 1.13 శాతం మాత్రమే అవకాశాలు దక్కాయని వివరించారు.

పాటలీపుత్ర దళిత సమావేశంలో వ్యాఖ్యలు

నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్స్ (ఎన్‌ఏసీడీఏఓఆర్) ఆధ్వర్యంలో జరిగిన 'పాటలీపుత్ర దళిత సమావేశం'లో పాల్గొన్న తేజస్వీ యాదవ్ దళిత సమస్యలపై మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన అంశాలను ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. 'పాటలీపుత్ర దళిత సమావేశం'లో పాల్గొన్నాను. గత 20 ఏళ్లుగా బీహార్‌లో నితీష్-బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను అమలు చేస్తోంది. దీని ఫలితంగా, బీహార్‌లో షెడ్యూల్డ్ కులాలకు రాష్ట్రంలో అవకాశాలు దక్కడం లేదు. 21.3 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వారికి 1.13 శాతం మాత్రమే దక్కుతున్నాయి.

విద్య, భూహక్కుల్లోనూ అసమానతలు

దళితులకు రాష్ట్రంలో విద్య, భూమి హక్కులు, ఉపాధి రంగాల్లో అవకాశాలు దక్కడం లేదని తేజస్వీ ఆరోపించారు. "దళితులపై నిరంతర దోపిడీ కారణంగా వారి పరిస్థితి దయనీయంగా ఉంది. మొత్తం షెడ్యూల్డ్ కుల జనాభాలో కేవలం 0.015 శాతం మాత్రమే వైద్యులుగా, 0.1 శాతం మాత్రమే ఇంజనీర్లుగా ఉన్నారు" అని ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం తగిన నిధులను కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. "షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల సబ్-ప్లాన్ కింద కేటాయించిన నిధులను బీహార్ ప్రభుత్వం ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోంది. దీని వల్ల ఈ వర్గాలకు ఎటువంటి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరడం లేదు. దళిత విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లు, పురోగతి, అభివృద్ధి, మెరుగుదల కోసం పథకాల విషయంలో ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వం నిధుల కొరత అనే సాకులు చెబుతోంది" అని ఆయన ఎక్స్‌లో రాశారు. ‘దళిత నాయకులమని చెప్పుకునే చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ అధికారంలో వాటా పొందిన తర్వాత దళితులపై దోపిడీ కొనసాగుతుంటే మౌనంగా ఉండిపోయారు.’ అంటూ తేజస్వీ విమర్శించారు. ఈ ఆరోపణలు ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వచ్చాయి. కాంగ్రెస్, ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాగట్ బంధన్ బీజేపీ, జేడీయూ కూటమి అయిన ఎన్‌డీఏను సవాలు చేయడానికి సిద్ధమవుతోంది.

దళితులు, బీసీల మద్దతే కీలకం

బీహార్‌లో ప్రస్తుతం దళితులు, బీసీల ఓట్లే అత్యంత కీలకం కాబోతున్నాయి. అందుకే మహాఘట్ బంధన్ కూటమి ఈ వర్గం ఓట్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపస్తోంది. రాష్ట్రంలో దళితులు 21 శాతం, బీసీలు 51 శాతం జనాభా ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వర్గాలను ఆకట్టుకుంటే కచ్చితంగా గెలుపు ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కులగణన, సామాజిక న్యాయం వంటి అంశాలను తెరమీదకు తీసుకొస్తున్నది.

ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ మహాగథ్‌బంధన్‌ను దళితులు, బీసీల పార్టీగా చెప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి ఓటు వేస్తేనే దళితులు, బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన బలంగా వాదిస్తున్నారు. ఆ వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ సైతం ఇదే తరహాలో రాజకీయం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఎన్డీయే వ్యూహం ఏమిటి?

అయితే ఎన్డీయే కూటమి సైతం బలంగా ప్రతిదాడి చేస్తోంది. గత ఆర్జేడీ పాలనలో ప్రజలకు హక్కులే లేకుండా పోయాయని.. మహిళలపై హింస జరిగిందని ప్రధాని మోడీ ఆరోపించారు. మళ్లీ వారికి అవకాశం ఇస్తే పాత రోజులు తీసుకొస్తారని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమికి ఓటు వేస్తే బీహార్ లో అభివృద్ధి జరుగుతుందని.. కేంద్రం సహకారంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. దళితులు, బీసీలు కాంగ్రెస్ కూటమివైపుకు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

కుల గణన, దళిత మహాకుంభ్ వంటి పథకాలు మొదలుపెట్టారు. మహిళలకు 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన'లో ₹10,000 ఆర్థిక సహాయం, స్వయం ఉపాధి అవకాశాలు అందిస్తున్నారు. మొత్తం 40 వేల కోట్ల రూపాయలతో వివిధ పథకాలను ఎన్డీయే కూటమి సర్కారు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో ఇటువంటి పథకాలు తీసుకొచ్చారు కాబట్టి .. ప్రజలు ఆ పథకాలను విశ్వసిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి. అయితే తాము ఎన్నికల్లో హమీలు ఇచ్చిన తర్వాతే నితీశ్ కుమార్ ఇటువంటి పథకాలను అమలు చేస్తున్నారని.. ఆయనకు ఓటమి భయం పట్టుకున్నదని కాంగ్రెస్ కూటమి ఆరోపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ బీహార్ ఎన్నికల మీద దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమై ఉంది.

బీహార్‌లో దళిత వ్యతిరేక ప్రభుత్వం - Tholi Paluku