Let's talk: editor@tmv.in
బీహార్‌లో కొత్త సీఎం ఎంపిక ప్రక్రియకు శ్రీకారం

బీహార్‌లో కొత్త సీఎం ఎంపిక ప్రక్రియకు శ్రీకారం

Pinjari Chand
13 ఏప్రిల్, 2026

బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రిగా ఉన్న శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ను పార్టీ కేంద్ర పరిశీలకుడిగా నియమించింది. మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌‌ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఈ నియమానికి ప్రాధాన్యం ఏర్పడింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీహార్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నికను చౌహాన్ పర్యవేక్షించనున్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా, జనతాదళ్‌(యునైటెడ్‌) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌‌ ఝా మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్‌ 13 తర్వాత ప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు. పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన నేతల్లో ఉప ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌదరితో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్‌కుమార్‌‌ చౌదరి కూడా ఉన్నారు. కొత్త ముఖ్యమంత్రి పేరును ఎన్డీయే శాసనసభ్యుల సమావేశంలో నిర్ణయిస్తారని వారు తెలిపారు. బీహార్ సీఎం పదవికి సమ్రాట్‌ చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ, బీజేపీ, జేడీయూ నాయకత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్డీయే శాసనసభ్యుల సమావేశం అనంతరం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా నితీశ్‌కుమార్‌‌ ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో, దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన పదవీకాలానికి ముగింపు పలికినట్లైంది. ఆయన మార్చి 30న రాష్ట్ర శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

బీహార్‌లో కొత్త సీఎం ఎంపిక ప్రక్రియకు శ్రీకారం - Tholi Paluku