Let's talk: editor@tmv.in
బీహార్‌లో ఎన్నికల నగారా

బీహార్‌లో ఎన్నికల నగారా

T Venkata Ramana
7 అక్టోబర్, 2025

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ ప్రకటించారు.

నాటకీయ పరిణామాలు

బిహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నీతీశ్ కుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

వచ్చేనెల 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి

నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని సీఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. బిహార్‌తో పాటు తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కూడా నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. బీహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వారిలో 14 లక్షల మంది కొత్త ఓటర్లని సీఈసీ తెలిపింది.

ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరాలు

బిహార్‌లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై జ్ఞానేశ్ కుమార్ స్పందించారు ‘‘ఎస్‌ఐఆర్ ముసాయిదాను ఆగస్టు ఒకటిన విడుదల చేశాం. దానిని అన్ని రాజకీయ పార్టీలకు అందజేశాం. అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేసే అవకాశం ఇచ్చాం. తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రకటించాం. ఇప్పటికీ అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం’’ అని తెలిపారు. ఈ ఎన్నికలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని జ్ఞానేశ్‌ చెప్పారు. 90 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. 7.43 కోట్ల మంది ఓటు వేయనున్నారని, వారిలో 3.92 కోట్ల మంది పురుషులు, 3.50 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు. రద్దీ నిర్వహణ కోసం ఒక్కో బూత్‌లో 1200 మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు వేసే ప్రక్రియను ఈ ఎన్నికలతోనే ప్రారంభిస్తున్నామని వివరించారు.

8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని అంతా, ఝార్ఖండ్‌లోని ఘట్‌శిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్‌, పంజాబ్‌లోని తర్న్‌తారన్‌, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాఢాతోపాటు జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గామ్‌, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఈసీ వెల్లడించింది.

పోలింగ్ తేదీలు

మొదటి దశ – నవంబర్ 6

రెండో దశ – నవంబర్ 11

ఓట్ల లెక్కింపు నవంబర్ 14

మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు

ఓటర్లు మొత్తం 7.42 కోట్లు

(14 లక్షల మంది కొత్త ఓటర్లు)

పోలింగ్ స్టేషన్లు 90,712

(ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్‌క్యాస్టింగ్)

ప్రత్యేక సదుపాయాలు

85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటింగ్ సదుపాయం.

బీహార్ ఎన్నికల నుంచి కొత్తగా 17 సంస్కరణలు

ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు సహా అమలు

ఎన్నికలపై ఏమైనా ఫిర్యాదు చేయాలంటే నెంబర్ 1950

నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 17, రెండోదశ అక్టోబర్ 20

నామినేషన్ ఉపసంహరణ గడువు అక్టోబర్ 20,రెండోదశ అక్టోబర్ 23

| పోలింగ్ తేదీ నవంబర్ 6న మొదటి దశ, నవంబర్ 11 న రెండో దశ

పోరుకు సిద్ధమైన పార్టీలు

ఎన్నికల నగారా మోగడంతో బీహార్‌లో రాజకీయ కాక తారస్థాయికి చేరింది. అధికార, విపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరుగనుండడంతో నెల రోజుల ముందు నుంచే రాజకీయ వేడి పెరిగింది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం బీహార్ పర్యటనకు వచ్చి రాష్ట్రానికి భారీగా 'వరాల జల్లు' కురిపించడం అధికార కూటమికి ఎన్నికల ముందు అతి పెద్ద అస్త్రంగా మారింది. గత ఐదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ అధికారం దక్కించుకోవాలని అధికార కూటమి ప్రయత్నాలు చేస్తోంది.

ప్రతిపక్షం దూకుడు

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అర్హులైన వేలాది మంది పేర్లు జాబితా నుంచి తొలగించారని ఆరోపించింది. 'ఒకే ఇంట్లో 247 పేర్లు కూడా ఉన్నట్లు' వెల్లడిస్తూ ఈ అక్రమాలపై ఈసీ తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేసింది. పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, పాలనలో లోపాలు, కుల రాజకీయాలను ప్రధానాంశాలుగా చేసుకొని ముందుకు వెళ్లాలని ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి.

ఎన్నికల సంఘం సంస్కరణలు

ప్రశాంతంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఈసీ స్పష్టం చేసింది. ఈసారి ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేశామని తెలిపింది. 90,712 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనుంది. ఓటర్ల తుది జాబితా ఆగస్టు 1న ప్రకటించినప్పటికీ నామినేషన్లకు 10 రోజుల ముందు కూడా జాబితాలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)ఇక నుంచి ఈవీఎంపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని ఎన్నికల సంఘం పేర్కొంది. తప్పుడు పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. బీహార్ ఎన్నికల నుంచి కొత్తగా అమలు చేస్తున్న 17 సంస్కరణలను భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని సీఈసీ వెల్లడించింది.

బీహార్‌లో ఎన్నికల నగారా - Tholi Paluku