
బీహార్‌లో ఉత్తమ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు నిర్మిస్తాం: రాహుల్ గాంధీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసిందని ఆరోపించిన రాహుల్, బీహార్‌లో కూడా గత ఎన్నికలలో ఇదే పరిస్థితి జరిగిందన్నారు. ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ బీజేపీ గెలుస్తోంది.కానీ నిజానికి అవి ప్రజల ఓట్లతో కాదు, దొంగిలించిన ఓట్లతో సాధిస్తున్న విజయాలు. హర్యానాలో, బీహార్‌లో కూడా ఇదే జరిగింది అని ఆయన పేర్కొన్నారు.
ఈసారి మాత్రం ఓటు దొంగతనానికి తావివ్వకూడదు. మోదీ, అమిత్ షా, ఎన్నికల కమిషన్ వీరంతా ఓటు దొంగతనంలో భాగస్వాములు. ప్రజలే రాజ్యాంగాన్ని రక్షించాలని రాహుల్ గాంధీ పూర్నియాలో నిర్వహించిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ చోరీ చేసింది. ఇప్పుడు ఇక్కడా కూడా అదే విధంగా చేయాలని చేస్తోంది. యువత అలర్ట్ గా ఉండి ఓట్ చోరీ జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు. బీహార్ లో నిరుద్యోగం ఎక్కువైంది. 20 సంవత్సరాల్లో నితీశ్ కుమార్ అభివృద్ది చేయలేదని విమర్శించారు. దుబాయ్ లాంటి నగరాలు బీహార్ యువతే నిర్మించింది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇక్కడి ప్రజలు ఉంటున్నారు. ఢిల్లీ లాంటి నగరాల్లో ఎటువంటి నీడ లేకుండా మెట్రో స్టేషన్ల కింద జీవితం కొనసాగిస్తున్నారు. ఎయిమ్స్ లో చికిత్స కోసం అక్కడికి సుమారు 4,5 వేల మంది ప్రజలు వస్తుంటారు. ఇక్కడే అటువంటి ఆసుపత్రులు ఎందుకు నిర్మించలేదు. ఇక్కడే మొబైల్ కంపెనీలు ఎందుకు స్థాపించలేదు. మేడిన్ చైనా బదులు, మేడిన్ బీహార్ అని ఎందుకు రావట్లేదు. వీటిన్నంటిపైనా ఇక్కడి ప్రజలు ఆలోచించాలన్నారు.
ఇదే సమయంలో ఆయన బీహార్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ బీహార్ మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలి. ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు ఇక్కడ ఉండాలి. బీహార్ పర్యాటక, పరిశ్రమల కేంద్రంగా మారాలి. కానీ మోడీ, నితీష్ కుమార్ అలా చేయలేదు. నితీష్ స్వతంత్రంగా పాలన చేయడం లేదు, ఆయనను ప్రధాని మోడీ రిమోట్ కంట్రోల్ చేస్తున్నారు అని విమర్శించారు.
రాహుల్ గాంధీ పూర్నియాలోని కస్బా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ ఇర్ఫాన్ ఆలంకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆయనకు ప్రత్యర్థులుగా లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత నితీష్ కుమార్ సింగ్, జన సురాజ్ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ ఇత్తెఫాక్ ఆలమ్, ఏఐఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ షానవాజ్ ఆలమ్ పోటీ చేస్తున్నారు. బీహార్ రెండో దశ ఓటింగ్ నవంబర్ 11న జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెలువడతాయి.
