Let's talk: editor@tmv.in
బీహార్‌లో ఆలయంలో తొక్కిసలాట..8 మంది భక్తుల మృతి
బీహార్‌లో ఆలయంలో తొక్కిసలాట..8 మంది భక్తుల మృతి

బీహార్‌లో ఆలయంలో తొక్కిసలాట..8 మంది భక్తుల మృతి

Pinjari Chand
1 ఏప్రిల్, 2026

బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో మంగళవారం ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటన నలందా జిల్లాలోని శీత్లా మాతా ఆలయం వద్ద ఉదయం భారీగా భక్తులు చేరుకోవడంతో జరిగింది. ఆలయం పరిధిలో అధిక జనసమ్మర్థం ఏర్పడటంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బీహార్ షరీఫ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నూరుల్ హక్ మాట్లాడుతూ మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసులు, జిల్లా అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బీహార్‌లోని నలందా జిల్లాలో జరిగిన ప్రమాదం తీవ్రంగా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని సందేశంలో పేర్కొన్నారు.

ఎస్‌హెచ్‌వో సస్పెన్షన్‌

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌‌ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.6 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నలందా డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ శుభమ్ కుమార్ మాట్లాడుతూ, ఆలయంలో భారీగా భక్తులు చేరుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలిపారు. ఈ ఘటనపై నిర్లక్ష్యానికి పాల్పడినట్లు భావిస్తూ దీప్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోను వెంటనే సస్పెండ్ చేశారు. ఘటనకు అసలు కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులను కూడా దర్యాప్తులో భాగం చేశారు. ఇదిలా ఉండగా, బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని తెలిపారు. మరోవైపు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ ఈ ఘటనకు పరిపాలనా వైఫల్యమే కారణమని ఆరోపించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించడంతో పాటు మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని, ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.