Let's talk: editor@tmv.in
బీసీ వ్యతిరేకులకు బీఆర్ఎస్ టికెట్ ఎట్ల‌ ఇస్తారు?: కవిత

బీసీ వ్యతిరేకులకు బీఆర్ఎస్ టికెట్ ఎట్ల‌ ఇస్తారు?: కవిత

Gaddamidi Naveen
7 ఫిబ్రవరి, 2026

మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్ వేసిన వ్యక్తికే బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.

శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన న్యాయపోరాటం వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హస్తం ఉందని ఆరోపించారు. బీసీలకు 42 శాతం కోటాను అడ్డుకున్న వ్యక్తికి టికెట్ ఇచ్చారంటే, ఆ పిటిషన్ వెనుక ఉన్నది బీఆర్ఎస్ పార్టీయేనా? అసలు బీఆర్ఎస్‌కు బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉందా? పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడూ బీసీల ప్రయోజనాలను మనస్ఫూర్తిగా సమర్థించలేదని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ సోదరులు ఆలోచించి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ వివరణ

కవిత విమర్శలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ స్పందించారు. మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక స్థానిక స్థాయిలో జరుగుతుందని, ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వడం పార్టీ ఉన్నత నాయకత్వానికి తెలియకపోవచ్చని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు. టికెట్ అంశాన్ని పార్టీ తగిన విధంగా పరిశీలిస్తుందని కూడా చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ, చట్టపరమైన సమస్యలు ఎదురవడంతో అది అమలులోకి రాలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కాంగ్రెస్‌పై కూడా విమర్శలు

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీపై కూడా కవిత విమర్శలు చేశారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన గాంధీ తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతలు అప్పగించడం తగదని అన్నారు.

అరికెపూడి గాంధీపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ తిరస్కరించారని కవిత పేర్కొన్నారు. గాంధీ ఇంకా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటే, కాంగ్రెస్ తరఫున ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఎలా పనిచేస్తారని ఆమె ప్రశ్నించారు. కనీసం ఇప్పటికైనా స్పీకర్ ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన నియామకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తలతో ఫిబ్రవరి 12న సమావేశం నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు. బీఆర్‌ఎస్ నుంచి సెప్టెంబర్ 2025లో సస్పెండ్ అయిన తర్వాత ఆమె తెలంగాణ జాగృతి వేదికగా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై తన తండ్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆమె పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ జాగృతి ద్వారా సామాజిక, ప్రజా అంశాలపై తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు కవిత తెలిపారు.

బీసీ వ్యతిరేకులకు బీఆర్ఎస్ టికెట్ ఎట్ల‌ ఇస్తారు?: కవిత - Tholi Paluku