
బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్పులకు రూ.90.50 కోట్లు మంజూరు
రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ,డీఎన్‌టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీ ఊతాన్ని ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘పీఎం యశస్వి’ పథకం కింద రెండో విడత స్కాలర్‌షిప్‌ల నిమిత్తం రూ. 90.50 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శుక్రవారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంజూరైన మొత్తం నిధులలో రూ. 69.40 కోట్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం కేటాయించారు. ఇవి కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నాయి. అదేవిదంగా పాఠశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద రూ. 21.10 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు వేర్వేరు ఉత్తర్వుల ద్వారా ఈ నిధులను వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యా నిధికి జమ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బీసీ బిడ్డల చదువుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఆశయమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ ఇప్పటికే ‘తల్లికి వందనం’ పథకం నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామని, అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు.
విద్యార్థుల ఆరోగ్యం సౌకర్యాల విషయంలోనూ ప్రభుత్వం రాజీ పడటం లేదని మంత్రి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేశామని వివరించారు. బీసీ గురుకులాలను ఆధునీకరించడంతో పాటు అక్కడ ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’ సెంటర్లు ఏర్పాటు చేసి ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
