
బీసీ కోటా బిల్లును పార్లమెంటులో ప్రస్తావించండి: ఎంపీలకు ఉప ముఖ్యమంత్రి పిలుపు
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బలంగా ప్రస్తావించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఎంపీలను కోరారు. ఈ మేరకు గురువారం ప్రజాభవన్‌లో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశమైన ఆయన… ఈ బిల్లును రాజ్యాంగ తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్రం తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్జర్న్‌మెంట్ మోషన్ ద్వారా లేదా ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని తప్పనిసరిగా చర్చకు తేవాలని ఎంపీలను భట్టి కోరారు. అన్ని పార్టీల ఎంపీలు కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వినతిపత్రం సమర్పించాలని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ బృందంతో కలిసి ఢిల్లీ వెళతారని స్పష్టం చేశారు.
ఈ ఏడాది రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బీసీ రిజర్వేషన్ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి అనుమతి కోసం పెండింగ్‌లో ఉన్నాయి. 50 శాతం పరిమితి దాటిన కోటాను న్యాయపరమైన సమస్యల నుంచి కాపాడేందుకు తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చడం తప్పనిసరని ఉప ముఖ్యమంత్రి గుర్తుచేశారు. పార్లమెంటు సమావేశాల సమయంలో ఎంపీలకు తక్షణ సమాచారం అందేలా ఢిల్లీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్టు భట్టి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడాలని, పార్టీలు దాటి రాష్ట్ర హక్కుల కోసం ఒక్కటై నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం పంపినట్టు ఆయన వెల్లడించారు.
47 పెండింగ్ అంశాలపై కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి
అలాగే ఈ సమావేశంలోనే రాష్ట్రానికి కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న 47 కీలక అంశాలపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించారు. విద్యుత్, నీటిపారుదల, జీఎస్టీ సహా అన్ని శాఖలకు చెందిన పెండింగ్ నిధుల వివరాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్రంలోని 12 శాఖలకు సంబంధించి మొత్తం 47 పెండింగ్ అంశాలను గుర్తించామని, వాటిపై ఉమ్మడిగా ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలు సిద్ధంగా ఉండాలని భట్టి పిలుపునిచ్చారు. సెమికండక్టర్ పరిశ్రమ స్థాపనతోపాటు ఇతర కీలక అంశాలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. డిసెంబరు 9న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విజయాల డాక్యుమెంట్, ‘విజన్ 2047’ పత్రం విడుదల చేయనున్నట్టు భట్టి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చే సమగ్ర ప్రణాళిక కూడా సిద్ధమైందని, గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల కమిటీల్లో ఆసక్తి ఉన్న ఎంపీలు చేరాలని ఆహ్వానించారు. రాష్ట్ర హక్కుల కోసం పార్టీలకు అతీతంగా ఒక్కటై నిలవడం ఈ సమావేశం ద్వారా స్పష్టమైందని, ఈ ఐక్యత కొనసాగితే పెండింగ్ అంశాలు త్వరగా పరిష్కారమవుతాయని ఉప ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
