Let's talk: editor@tmv.in
బీసీలను అడ్డుకుంటే తిరుగుబాటే: తీన్మార్ మల్లన్న

బీసీలను అడ్డుకుంటే తిరుగుబాటే: తీన్మార్ మల్లన్న

T Venkata Ramana
12 అక్టోబర్, 2025

బీసీ రిజర్వేషన్లపై కోర్టులో ఎదురుదెబ్బ తగలగానే కొందరు రెడ్లు టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం యావత్ బీసీ సమాజాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. బడుగు బలహీన వర్గాల హక్కును కాలరాసేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కొందరి వైఖరిపై ఆయన మండిపడ్డారు.

బీసీల హక్కు అడ్డుకున్నందుకు సంబరాలా?

కోర్టులో బీసీ రిజర్వేషన్లకు తాత్కాలికంగా బ్రేక్ పడగానే, పిడికెడు కూడా లేని కొందరు రెడ్లు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, బీసీలకు హక్కుగా రావాల్సిన వాటాను అడ్డుకున్నామని సంబురాలు చేసుకుంటున్న వీరి తీరు యావత్ బీసీ సమాజం దృష్టికి వచ్చిందన్నారు తీన్మార్ మల్లన్న. ఇటువంటి చర్యలు బీసీలను అవమానించడమేనని ఖండించారు. మన ప్రధాన శత్రువు ఎవరో బీసీ సమాజానికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది" అని తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మన ఓట్లు వాళ్లకొద్దు, వాళ్ల ఓట్లు మనకొద్దు

"బీసీల కూడు లాక్కున్నామని సంతోషపడుతున్న ఈ వర్గానికి సంబంధించిన ఓట్లు మనకొద్దు, మన ఓట్లు వాళ్లకొద్దు" అని మల్లన్న బహిరంగంగా పిలుపునిచ్చారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం పట్ల కొందరు రాజకీయ నాయకులు, అగ్రవర్ణాల వారు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై కోర్టులో ఎదురవుతున్న అడ్డంకుల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని కూడా మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. 4 కోట్ల మంది ప్రజలను నియంత్రించే శక్తి ఉన్న ముఖ్యమంత్రి, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులను ఆపలేరా?" అని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లకు జీవో ఇచ్చేది రెడ్డి ముఖ్యమంత్రి అయితే, దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్లేదీ రెడ్లే వాదించే న్యాయవాదులు కూడా రెడ్లే అంటూ ఎద్దేవా చేశారు.

సమస్యకు పరిష్కారం ఏంటి?

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేసే ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే, రాష్ట్రంలో సరికొత్త తిరుగుబాటు తప్పదని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మల్లన్న హెచ్చరించారు. బీసీల హక్కుల కోసం ప్రతీ ఒక్కరూ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, తమ రాజ్యాధికార పార్టీ బీసీల వాటా కోసం పోరాడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

బీసీలను అడ్డుకుంటే తిరుగుబాటే: తీన్మార్ మల్లన్న - Tholi Paluku