
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం మోసం చేశారు- కేటీఆర్
ప్రతి ఇంటికీ కాంగ్రెస్ బాకీ పడ్డ విషయాలను గుర్తించుకోవాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతేకాకుండా నెలకు రూ.2వేల చొప్పున వృద్ధులకు రూ.48వేల రూపాయలు, పెళ్లి అయిన కోటి 67వేల ఆడబిడ్డలకు తులం బంగారం రావాలన్నారు. వీటిపై కాంగ్రెస్ ను గట్టిగా నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ జూబ్లిహిల్స్ లోని రహమత్ నగర్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనను ఏకీపారేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రజల్లో కసి, పట్టుదల, తపన బీఆర్‌ఎస్ విజయానికి నాంది కావాలన్నారు.
మన రక్తంలోనే పోరాటం ఉంది
మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు కేటీఆర్. మన కుటుంబంలో ఒకరు మాగంటి గోపీనాథ్ చిన్నవయసులోనే కన్నుమూయడం బాధాకరమన్నారు. ఆడబిడ్డలకు చిరు కానుకలు ఇస్తూ మాగంటి గోపీనాథ్ ఆదుకున్నారని కొనియాడారు. ఆ కుటుంబానికి అండగా ఉన్నామని ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నవారు రేవంత్‌రెడ్డిని తెలుగు భాషలో తిట్టరాని తిట్లు తిడుతున్నారని కేటీఆర్ అన్నారు.
ధోకా తిన్న తెలంగాణకు ఇవాళ మోకా వచ్చిందని, ప్రతి ఇంటికి వెళ్లి నిజం చెప్పాలని గులాబీ జెండా మరోసారి రెపరెపలాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన ప్రతి ఒక్కరినీ కలిసి
బాకీ కార్డులపై ప్రశ్నించాలన్నారు.
ప్రతి ఇంటికీ కాంగ్రెస్ బాకీ పడ్డ విషయాలను వివరించాలన్నారు. నెలకు రూ.2వేల చొప్పున వృద్ధులకు రూ.48వేల రూపాయలు అదే విధంగాపెళ్లి అయిన కోటి 67వేల ఆడబిడ్డలకు తులం బంగారం రావాలన్నారు. మహాలక్ష్మి పథకంకింద మహిళలకు రూ.40వేలు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా రావడం లేదని గుర్తు చేశారు.
అండగా నిలిచారు
ఇవాళ ఉప ఎన్నికలు కారు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్నాయన్నారు. కారు రావాలంటే మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలన్నారు. 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 5 శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. మోసపోయిన అన్నాచెల్లెళ్లు జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నారన్నారు.ఆటో డ్రైవర్లు మొదలుకొని బస్ డ్రైవర్లు అందరి చూపూ జూబ్లీహిల్స్ వైపే ఉందన్నారు. ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డులు పెడతామని ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. అత్తలు, కోడళ్లు, ఆడపిల్లలు, గర్భిణిలు, బాలింతలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు.
గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్క సీటు ఇవ్వకుండా కేసీఆర్‌కు అండగా నిలిచారన్నారు.కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు.
కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా
ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూలగొట్టడమా? ఎంతో మంది నిరుపేద, గరీబోళ్లను రోడ్లపైకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కళ్లు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు వస్తాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఏమీ ఇవ్వకున్నా గెలిచామని, నాకే వేస్తున్నారని రేవంత్ అనుకుంటాడన్నారు. నెల రోజులు గట్టిగా కొట్లాడాలని, గలీజ్ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని కేటీఆర్ మండిపడ్డారు. నీ గుడ్లు పీకి గోటీలాడుతా.. పేగులు తీసి మెడలో వేసుకుంటానంటాడు, హామీలపై ప్రశ్నిస్తే లంకెబిందెలు ఉంటాయనుకున్నానని అంటాడు. లంకెబిందెల కోసం ఎవరు తిరుగుతారో మీకు తెలుసని రేవంత్ కు సెటైర్ లు వేశారు.
అజారుద్దీన్ నోరు మూయించారు
ఎన్నడూ ఇంత దివాళాకోరు మాటలు ఏ ముఖ్యమంత్రీ మాట్లాడలేదన్నారు. అప్పు కోసం వెళితే దొంగలెక్క చూస్తున్నారని , అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని చెబుతున్నాడని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. పోయిన సారి అజారుద్దీన్ పోటీ చేశారు. టికెట్ అడుగుతారని ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన నోరు మూయించారని, కోర్టులో నిలబడదని తెలిసీ షేక్‌పేట్ వద్ద ఖబ్రస్థాన్‌కు జాగా ఇచ్చారన్నారు. జూబ్లీహిల్స్‌లో కొట్టే దెబ్బకు ఢిల్లీలో అధిష్టానం అదిరిపడాలన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు నల్లా బిల్లులు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకే ఇంటిలో 43 దొంగ ఓట్లు రాయించారని, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. నెల రోజులపాటు ఇంటింటికీ బాకీ కార్డు పట్టుకుని వెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు.దొంగ ఓట్లు పడకుండా అందరినీ ఓట్లు వేసేలా మోటివేట్ చేయాలన్నారు. రాబోవు నెల రోజులపాటు కాంగ్రెస్‌పై వ్యతిరేకత పూర్తిస్థాయిలో ఓట్ల రూపంలో బీఆర్ఎస్ కు పడాలని కేటీఆర్ ప్రజల్ని కోరారు.
