
బీసీకే జూబ్లీహిల్స్ టికెట్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీకే అవకాశం ఇస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీ జపం చేస్తున్న విషయం తెలిసిందే. కులగణన, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలను తెరమీదకు తీసుకొచ్చింది? తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ ఇదే తరహా వ్యూహాన్ని అవలంబించింది. మరి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ 'బీసీ మంత్రం' చేపట్టిన కాంగ్రెస్, ఈ ఉపఎన్నికలో కూడా అదే వ్యూహాన్ని అవలంబిస్తోంది. మంత్రుల సిఫార్సులు, సర్వేల ఆధారంగా అభ్యర్థి ఎంపిక జరుగుతుందని, రెండు రోజుల్లో 'బస్తీ బాట' క్యాంపెయిన్‌తో ప్రజలకు పార్టీ సంక్షేమ పథకాలు వివరిస్తామని మహేశ్ గౌడ్ ప్రకటించారు. ఈ వ్యూహం ఫలిస్తుందా? లేక పోటీ పార్టీలు దీన్ని ఎదుర్కొంటాయా? అన్నది వేచి చూడాలి.
బీసీ మంత్రం జపిస్తున్న కాంగ్రెస్
తెలంగాణలో గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బీసీ మంత్రం జపిస్తోంది. కులగణన, బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు వంటి అంశాలతో బీసీ సమాజాన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. జూబ్లీహిల్స్‌లో కూడా ఈ ‘బీసీ మంత్రం’ జపిస్తోంది. మరోవైపు ముగ్గురు మంత్రుల కమిటీ కూడా బీసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. నవీన్ యాదవ్ (బీసీ నేత) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అధిష్ఠానం నుంచి ఇందుకు అనుమతి రావాల్సి ఉంది.
కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?
ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీలు, మైనార్టీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. దీంతో బీసీ ఓటర్లను ఆకర్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ అభ్యర్థిని పోటీలో ఉంచడం, బీసీ కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్లు తమకు కలిసివస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ఎంఐఎం అధికారికంగా ప్రకటించినప్పటికీ ఎంఐఎం నేతలు కాంగ్రెస్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో ఎంఐఎం మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ అంశాల ఆధారంగా ఈ నియోజకవర్గంలో సులభంగా గెలుస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నది. 'బస్తీ బాట' క్యాంపెయిన్‌తో ప్రగతి భవనాలు, రోడ్లు, స్కూళ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చేస్తామని పీసీసీ చీఫ్ అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఓ కొలిక్కి రాలేదు. న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ దూకుడు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న పోలింగ్, 14న ఫలితాలు వెలుగులోకి వస్తాయి. బీఆర్ఎస్ ఇప్పటికే మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. 2018, 2023లో ఆమె భర్త మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. ఆయన మరణంతోనే ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే గోపీనాథ్ కుటుంబం మీద ఉన్న సానుభూతి తమకు అనుకూలంగా మారుతుందని బీఆర్ఎస్ అంటున్నది. బీజేపీ ఈ నియోజకవర్గంలో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఆ పార్టీకి సైతం ఇక్కడ కొంత ఓటు బ్యాంక్ ఉంది.
జూబ్లీహిల్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 3 లక్షల 99వేల దాకా ఉంటుంది. అయితే వీరిలో బీసీలు లక్షా యాబై వేల వరకు ఉంటారని ఒక అంచనా. మొత్తం ఓటర్లలో బీసీల శాతం దాదాపుగా 35 నుంచి 38 శాతం వరకు ఉంటుంది. మైనార్టీలు కూడా లక్ష పైగానే ఉంటారు. దీంతో వీరి ఓటు బ్యాంక్ అత్యంత కీలకం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇటు బీసీ జపం, అటూ ఎంఐఎంతో దోస్తానా చేస్తోంది. తద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోంది. ఇక ఈ నియోజకవర్గంలో ఉన్నతవర్గాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వారి ఓట్లు ఎటు వైపు వెళ్తాయో చూడాలి. ఇక హైడ్రా మీద జరుగుతున్న ప్రచారం, హామీల అమలు చేయకపోవడం వంటి అంశాలు కూడా ఈ ఎన్నికలో ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ బీసీ, మైనార్టీ మంత్రం పనిచేస్తుందా? లేదంటే బీఆర్ఎస్ నమ్ముకున్న సానుభూతి అంశం పనిచేస్తుందా? అన్నది వేచి చూడాలి. ఈ ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అత్యంత కీలకం. ఇక ఈ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు కూడా అత్యంత కీలకం. ఈ సారి సెటిలర్లు ఎవరికి మద్దతు ఇస్తారో వేచి చూడాలి.
