
బీఫ్ వివాదంలో కున్కీ చౌదరి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటాం: సీఎం హిమంత
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బీఫ్ వినియోగం వివాదంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. అస్సాం జనతా పరిషత్ (ఏజేపీ) అభ్యర్థి కుంకీ చౌదరి తల్లిదండ్రులు బీఫ్ తిన్నారని, దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపిస్తూ, ఎన్నికల తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వివాదంపై మాట్లాడిన సీఎం హిమంత బిశ్వ శర్మ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా విషయం కాదు. ఆమె తల్లిదండ్రులు బీఫ్ తింటారని ఒప్పుకుని, తాను సనాతని హిందువని చెప్పాలని అన్నారు. బీఫ్ తినే వ్యక్తులకు ఓటు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
నాపై డీప్‌ఫేక్ ప్రచారం జరుగుతోంది
గౌహాతి సెంట్రల్ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేస్తున్న 27 ఏళ్ల కున్కీ చౌదరి ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. సీఎం చేస్తున్న ఆరోపణలు తప్పుడు ప్రచారం అని ఆమె పేర్కొన్నారు. తన కుటుంబంపై తప్పుడు వీడియోలు, డీప్‌ఫేక్ ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ ఆమె ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చేసిన వ్యాఖ్యల వల్ల దేశవ్యాప్తంగా తన పేరు ప్రచారంలోకి వచ్చిందని ఆమె వ్యంగ్యంగా స్పందించారు. ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి 15 రోజులు మాత్రమే అయ్యింది. అయినా ప్రజల నుంచి వచ్చిన మద్దతు బీజేపీని ఆందోళనకు గురి చేసిందని ఆమె వ్యాఖ్యానించారు.
అస్సాంలో బీఫ్ తినడం పూర్తిగా నిషేధం కాకపోయినా, అస్సాం క్యాటిల్ ప్రిజర్వేషన్ యాక్ట్–2021 ప్రకారం హిందూ, జైన్, సిక్కు సమాజం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఆలయాలు, సత్రాల (వైష్ణవ మఠాలు) నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో పశువుల వధ, బీఫ్ విక్రయాన్ని నిషేధించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో గౌహాతి సెంట్రల్ నుంచి కున్కీ చౌదరి, బీజేపీ నేత విజయ్ కుమార్ గుప్తాకు పోటీగా నిలిచారు. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
