
బీడబ్ల్యూఎఫ్ సభ్యురాలిగా మూడోసారి సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా వరుసగా మూడోసారి నియమితులయ్యారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు తొలిసారిగా 2017లో ఈ కమిషన్‌కు ఎంపికయ్యారు. ఆ తర్వాత 2021లో రెండోసారి చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఆమె 2020 నుండి బీడబ్ల్యూఎఫ్ ఇంటిగ్రిటీ అంబాసిడర్‌గా కూడా కొనసాగుతున్నారు.
2026- 2029 కాలానికి గాను బీడబ్ల్యూఎఫ్ తాజాగా ప్రకటించిన నూతన సభ్యుల జాబితాలో ఆమెతో పాటు ఆన్ సె-యంగ్ (కొరియా), దోహా హనీ (ఈజిప్ట్), జియా యి ఫాన్ (చైనా), డెబోరా జిల్లే (నెదర్లాండ్స్) కమిషన్‌లో చోటు దక్కించుకున్నారు. అయిదు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో ఈ షట్లర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సింధు మూడోసారి కమిషన్ సభ్యురాలిగా చేరగా, ఆన్ సె-యంగ్, జియా యిఫాన్ మొదటిసారి కమిషన్‌లో చేరారు.
బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ పాత్ర
బ్యాడ్మింటన్ క్రీడాకారుల వాణిని అత్యున్నత స్థాయిలో (కౌన్సిల్ లో) వినిపించేలా చూస్తుంది. దీంతో పాటు, టోర్నమెంట్ నిబంధనలు, ఆటగాళ్ల సంక్షేమం, ఇంటిగ్రిటీ, మొత్తం పోటీ వాతావరణం వంటి కీలక అంశాలపై సలహా ఇస్తూ బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్‌కు సలహా మండలిగా కూడా ఈ కమిషన్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కమిషన్ ఒక చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటుంది
