Let's talk: editor@tmv.in
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో ఇండియా ఓపెన్ కీలక టోర్నమెంట్‌: సంజయ్ మిశ్రా

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో ఇండియా ఓపెన్ కీలక టోర్నమెంట్‌: సంజయ్ మిశ్రా

Pinjari Chand
13 జనవరి, 2026

యోనెక్స్–సన్‌రైజ్ ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు ముందు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రా ఈ టోర్నీని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్‌లో ఒక కీలకమైన ‘పిట్‌స్టాప్’గా అభివర్ణించారు. ఈ ఏడాది ఆగస్టులో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లు జరగనున్న నేపథ్యంలో, ఇండియా ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ఆటగాళ్లకు ఇది అదనపు ప్రోత్సాహంగా మారుతుందని ఆయన తెలిపారు. మాజీ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, అలాగే పురుషుల డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి–సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి కూడా స్వదేశంలో ఆడుతూ మంచి ఫలితాలు సాధించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నారు. అదే వేదికపై ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌లు జరగనున్న నేపథ్యంలో, యోనెక్స్–సన్‌రైజ్ ఇండియా ఓపెన్ 2026కి ఈసారి మరింత ప్రాధాన్యం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ప్రీ-ఈవెంట్ ప్రెస్‌మీట్‌లో సంజయ్ మిశ్రా మాట్లాడుతూ ఇండియా ఓపెన్ ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో ఒక కీలక టోర్నమెంట్‌గా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో తమ ముద్ర వేయాలని ఆటగాళ్లు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. ఈసారి మాత్రం, కొత్త వేదికలో ఆట పరిస్థితులకు అలవాటు పడేందుకు, అలాగే అదే వేదికపై జరగనున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లు 2026 దృష్ట్యా, ఆటగాళ్లకు మరింత ప్రేరణగా ఉంటుంది. 17 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లకు ఆతిథ్యం ఇవ్వబోతోందని తెలిపారు.

వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్ అయిన ఇండియా ఓపెన్ 2026 జనవరి 13 నుంచి 18 వరకు జరుగుతుంది. ఇది ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లకు ఒక రిహార్సల్‌లా ఉపయోగపడనుంది. ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని విశాలమైన మల్టీ పర్పస్ హాల్‌లో మ్యాచ్‌లు జరగడం వల్ల అభిమానులకు మరింత మెరుగైన వీక్షణ అనుభవం లభించనుంది. ప్రతి ఏడాది లాగానే, ఈసారి కూడా ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. చైనా ప్రపంచ చాంపియన్ షీ యూ కీ, మహిళల వరల్డ్ నంబర్ వన్ ఆన్ సె యంగ్, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ చాంపియన్ క్రిస్టో పోపోవ్ వంటి స్టార్ ప్లేయర్లు బరిలో దిగనున్నారు. మొత్తం 20 దేశాల నుంచి 256 మంది ఆటగాళ్లు పోటీపడుతుండగా, చైనీస్ తైపే నుంచి అత్యధికంగా 36 మంది షట్లర్లు పాల్గొంటున్నారు.

అభిమానుల మధ్య ఆడటం ప్రత్యేకమైంది

పీవీ సింధు మాట్లాడుతూ ప్రతి ఏడాది జనవరిలో ఢిల్లీలో ఇండియా ఓపెన్ ఆడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. స్వదేశంలో, అభిమానుల మధ్య ఆడటం ఒక ప్రత్యేకమైన అనుభూతి. అభిమానులు, ఫెడరేషన్ అందించే మద్దతు ఎంతో ప్రోత్సాహకరం. మేం మా శక్తి మేరకు 100 శాతం ప్రయత్నించి మంచి ఫలితాలు సాధించడానికి ఆశిస్తున్నామని అన్నారు. చిరాగ్ శెట్టి అభిమానులను ప్రశంసిస్తూ 2017లో తొలిసారి ఇండియా ఓపెన్ ఆడాం. అప్పటి నుంచి ఈ టోర్నీ ప్రతి ఏడాది మరింత పెద్దదవుతోంది. 2022లో ఇండియా ఓపెన్ గెలవడం మాకు ఆ ఏడాది మొత్తం మంచి ఆత్మవిశ్వాసం లభించింది. ఈసారి కూడా టోర్నీలో ఎంత దూరం వెళ్లగలమో అంత దూరం వెళ్లాలని కోరుకుంటున్నాం. స్టేడియంలో అభిమానుల మద్దతు ఉంటే మా ప్రదర్శన మరింత మెరుగవుతుందని తెలిపారు.

సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి కూడా మాట్లాడుతూ ఈ ఈవెంట్ ప్రతి ఏడాది మరింత విస్తృతమవుతోంది. ఈసారి పెద్ద స్టేడియం లభించడం సంతోషంగా ఉంది. ఆగస్టులో ఇదే వేదికపై ప్రపంచ చాంపియన్‌షిప్‌లు జరగనున్నాయి. గతేడాది తొలి రౌండ్ నుంచే స్టేడియం నిండిపోయింది. ఈసారి కూడా పూర్తి హౌస్ ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. 850,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్, ఆటగాళ్లకు ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించుకునే అవకాశాన్ని అందించడంతో పాటు, ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లకు అవసరమైన ఆట పరిస్థితులకు అలవాటు పడేందుకు కూడా ఉపయోగపడనుంది. యోనెక్స్–సన్‌రైజ్ ఇండియా ఓపెన్ ప్రాధాన్యంపై బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షురాలు ఖున్యింగ్ పటామా లీస్వడ్ట్రాకుల్ ఒక రికార్డెడ్ సందేశంలో మాట్లాడుతూ భారత్ ఎన్నో గొప్ప బ్యాడ్మింటన్ ప్రతిభలను ప్రపంచానికి అందించింది. ఈ టోర్నమెంట్ కేవలం అగ్రశ్రేణి పోటీ మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు ప్రేరణనిచ్చే వేదిక కూడా. ఇండియా ఓపెన్ 2026, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన అనుభవాన్ని అందిస్తుందని అన్నారు.

ఈ టోర్నీ స్పాన్సర్ అయిన సన్‌రైజ్ స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమాదిత్య ధర్ మాట్లాడుతూ గ్రాస్‌రూట్ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బ్యాడ్మింటన్ అభివృద్ధిలో యోనెక్స్–సన్‌రైజ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియా ఓపెన్ దేశంలో బ్యాడ్మింటన్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ వారం జరిగే ప్రదర్శనలు మరెందరో పిల్లలను ఈ క్రీడ వైపు ఆకర్షిస్తాయని నమ్ముతున్నామని తెలిపారు.