Let's talk: editor@tmv.in
బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

Shaik Mohammad Shaffee
10 అక్టోబర్, 2025

భారత సైన్యంలో అధికారులుగా కెరీర్‌ని ప్రారంభించాలనుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కోర్సు జూలై 2026లో ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), డెహ్రాడూన్‌లో ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్‌లలో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ (బీఈ/బీటెక్) ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం విద్యార్థులు ఐఎంఏలో శిక్షణ ప్రారంభమయ్యే తేదీ (జులై 1, 2026) నాటికి వారి ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి, 12 వారాల్లోపు సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. జూలై 1, 2026 నాటికి అభ్యర్థి వయస్సు 20 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థులు జూలై 1, 1999 కంటే ముందు, జూన్ 30, 2006 తర్వాత జన్మించి ఉండకూడదు. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము లేదు.

ఎంపిక ప్రక్రియ

ఇంజనీరింగ్ డిగ్రీలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను అలహాబాద్, భోపాల్ లేదా బెంగళూరులోని సెలక్షన్ సెంటర్స్‌లో ఐదు రోజుల సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో స్టేజ్-I (స్క్రీనింగ్ టెస్ట్), స్టేజ్-II (సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్‌లు, వ్యక్తిగత ఇంటర్వ్యూ) ఉంటాయి. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో పాసైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు.

శిక్షణ, వేతనం

ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో దాదాపు 12 నెలల పాటు శిక్షణ ఉంటుంది. ట్రైనింగ్‌ సమయంలో వీరికి నెలకు రూ.56,400 స్టైపెండ్ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది. లెఫ్టినెంట్ ర్యాంక్‌కు పే మ్యాట్రిక్స్ లెవల్ 10 ప్రకారం నెలకు రూ.56,100 నుండి రూ.1,77,500 వరకు బేసిక్ పేతో పాటు ఇతర భత్యాలు లభిస్తాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.inను సందర్శించండి. 'ఆఫీసర్ ఎంట్రీ అప్లై/లాగిన్'పై క్లిక్ చేయండి. రిజిస్టర్ చేసుకోకపోతే 'రిజిస్ట్రేషన్'పై క్లిక్ చేసి వివరాలు నింపి నమోదు చేసుకోండి. లాగిన్ అయిన తర్వాత, డాష్‌బోర్డ్‌లో 'అప్లై ఆన్‌లైన్'పై క్లిక్ చేయండి. అక్కడ 'టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు-143' ఎదురుగా ఉన్న 'అప్లై' బటన్‌పై క్లిక్ చేయండి. దరఖాస్తు ఫారమ్‌ను అన్ని వివరాలతో జాగ్రత్తగా నింపండి. చివరగా దరఖాస్తును ‘సబ్మిట్' చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు joinindianarmy.nic.inలో ఉన్న అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి.

లెఫ్టినెంట్ కెరీర్

భారత సైన్యంలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసి లెఫ్టినెంట్ ‌గ కెరీర్‌ను ప్రారంభిస్తారు. ఇది శాశ్వత కమీషన్ పోస్ట్. రెండేళ్ల లెఫ్టినెంట్ సర్వీసు తర్వాత కెప్టెన్ స్థాయికి పదోన్నతి పొందుతారు. కెప్టెన్‌గా ఆరేళ్లు పనిచేసి మేజర్‌గా, ఆ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి పొందవచ్చు. ఆ తర్వాత అర్హత, సీనియారిటీల ఆధారంగా కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.

బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు - Tholi Paluku