Let's talk: editor@tmv.in
బీజేపీ రాజ్యసభ ఎన్నికల తొలి జాబితా విడుదల

బీజేపీ రాజ్యసభ ఎన్నికల తొలి జాబితా విడుదల

Pinjari Chand
4 మార్చి, 2026

రాబోయే ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం తొలిజాబితాను విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి ఈ ప్రకటన చేసింది.

రాష్ట్రాలవారీగా అభ్యర్థులు

• బీహార్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబిన్, శివేశ్ కుమార్‌ను ఎంపిక చేసింది.

• అస్సాం నుంచి తేరష్ గోవాలా, జోగెన్ మోహన్‌కు అవకాశం కల్పించింది.

• ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ బరిలోకి దిగనున్నారు.

• హర్యానా నుంచి సంజయ్ భాటియా అభ్యర్థిగా నిలుస్తారు.

• ఒడిశా నుంచి మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్‌కు టికెట్ ఇచ్చింది.

• పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హా ఎంపికయ్యారు.

ఇతర పార్టీల అభ్యర్థులు

ఇదిలా ఉండగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో బాబుల్ సుప్రియో, రాజీవ్ కుమార్, మేనక గురుస్వామి, కోయెల్ మాలిక్ ఉన్నారు. అదే విధంగా బిజు జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఒడిశా నుంచి డా. సంసృప్త మిశ్రా, డా. దత్తేశ్వర్ హోటా పేర్లను ప్రకటించారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభిషేక్ మను సింగ్వీని రెన్యూవల్ చేయనుంది. రెండో స్థానం కోసం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఎన్నికల షెడ్యూల్

భారత ఎన్నికల సంఘం ప్రకారం, రాజ్యసభ ఎన్నికల పోలింగ్ మార్చి 16న జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 20 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ఎన్నికల ద్వారా మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 స్థానాలు భర్తీ కానున్నాయి. నామినేషన్ల చివరి తేదీ మార్చి 5 కాగా, పరిశీలన మార్చి 6న, ఉపసంహరణకు మార్చి 9 చివరి తేదీగా నిర్ణయించారు.

బీహార్ నుంచి రాజ్యసభకు నితిన్ నబిన్

జాతీయ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభలో ప్రవేశించడానికి సిద్ధమయ్యారు. ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆయనను బీహార్ నుంచి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా ప్రకటించింది. మరో అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శివేశ్ కుమార్ పేరు ఖరారు చేసింది. ప్రస్తుతం నితిన్ నబిన్ బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. జనవరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది బీజేపీలో మూడో తరం నాయకత్వం ఎదుగుదలకు సంకేతమని విశ్లేషణలు వెలువడ్డాయి.

సామాజిక సమీకరణపై దృష్టి

కాయస్థ సమాజానికి చెందిన నితిన్ నబిన్‌ను ఎంపిక చేయడం ద్వారా అగ్రవర్ణాల మద్దతును నిలబెట్టుకోవాలనే ప్రయత్నంగా భావిస్తున్నారు. మరోవైపు, శివేశ్ కుమార్ ఎంపిక దళిత వర్గాల వైపు పార్టీ దృష్టిని సూచిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

నామినేషన్లు మార్చి 5న

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సారోగి ప్రకారం, నితిన్ నబిన్, శివేశ్ కుమార్ మార్చి 5న నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అదే రోజు రాష్ర్టీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహ కూడా నామినేషన్ వేయనున్నారు.

బీహార్‌లో సమీకరణలు

243 సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 89 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకునే బలం ఉందని అంచనా. మిగతా స్థానాలకు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ (యునైటైడ్) పోటీ చేయనుంది. ఇదిలా ఉండగా ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతా దళ్ కూడా ఒక స్థానానికి పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో బీహార్ రాజ్యసభ పోరు ఆసక్తికరంగా మారింది.

రాజీనామా అంశం

నితిన్ నబిన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నందున, రాజ్యసభకు ఎన్నికైన తర్వాత అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే పార్టీ అధ్యక్ష పదవిపై ఎలాంటి మార్పులు ఉంటాయో స్పష్టత రావాల్సి ఉంది.