
బీజేపీ మద్దతుదారులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ. 10 లక్షలు ఇస్తా:బండి సంజయ్ సంచలన ప్రకటన
కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని(మద్దతుదారులను) ఏకగ్రీవంగా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి నేరుగా రూ.10 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఖాళీ మాటలేనని ఆయన విమర్శించారు. ‘‘బీఆర్‌ఎస్ ఐదేళ్లు ప్రజలను మోసం చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ కూడా అదే పాత కథ.. మాయ మాటలు అని ధ్వజమెత్తారు.
‘నేనే నేరుగా ఇస్తా.. ఆలస్యం లేదు..సాకులు లేవు’
మంగళవారం రాత్రి ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోలో సంజయ్ ఇలా తెలిపారు. ‘కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ మద్దతు ఉన్న సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వెంటనే రూ.10 లక్షలు అందిస్తాం. పీఎంపీఎల్‌ఏడీఎస్ నిధులు నా వద్ద ఉన్నాయి. అభివృద్ధికి వినియోగిస్తాం. బీజేపీ అయితేనే నిధులు వస్తాయి. మిగతావాళ్లు గెలిస్తే కేంద్రం నిధులు కూడా ఉండవు అని హెచ్చరించారు. తాను ఇప్పటికే కోట్ల విలువైన సీఎస్ఆర్ నిధులను తెచ్చి, విద్య, వైద్య రంగాల్లో ఖర్చు చేశానని గుర్తుచేశారు. ఇక కేంద్రంలో మంత్రి కావడంతో మరిన్ని నిధులు తీసుకువస్తానని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో కరీంనగర్‌లోనే 70 గ్రామాలు ఏకగ్రీవ సర్పంచ్లను ఎన్నుకున్నా , ఒక్క రూపాయి కూడా రాలేదని ఆరోపించారు. తెలంగాణలో
గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17న ఎన్నికలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నేటి నుంచి మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
