Let's talk: editor@tmv.in
బీజేపీ బెంగాల్‌ వ్యతిరేకి: మమతా బెనర్జీ

బీజేపీ బెంగాల్‌ వ్యతిరేకి: మమతా బెనర్జీ

Pinjari Chand
17 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్రంలోని ఉన్నతాధికారులను బదిలీ చేసిన నిర్ణయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఈ చర్యను ఆమె మహిళలకు, బెంగాల్ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ఎలక్షన్‌ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ), అలాగే బీజేపీపై విమర్శలు గుప్పించారు. కోల్‌కత్తా నగరంలోని డోరీనా క్రాసింగ్ వద్ద ఎల్పీజీ సంక్షోభంపై నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ, ఎంతమంది అధికారులను మార్చినా బెంగాల్ ప్రజల నిర్ణయాన్ని మార్చలేరని వ్యాఖ్యానించారు. ఎవరిని నియమించినా వారు చివరికి బెంగాల్‌కే పనిచేస్తారని ఆమె అన్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న నందిని చక్రవర్తిని అర్ధరాత్రి సమయంలో పదవి నుంచి తొలగించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. బెంగాలీ మహిళ అయిన ఆమెను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా తొలగించడం మహిళల పట్ల అవమానకరమని అన్నారు. ఇదే సమయంలో హోమ్ సెక్రటరీగా ఉన్న జగదీశ్‌ ప్రసాద్‌ మీనాను కూడా తొలగించడాన్ని ప్రస్తావిస్తూ, ఇది సమర్థవంతంగా పనిచేసే అధికారుల పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతోందని వ్యాఖ్యానించారు. బెంగాల్‌ను ఎవరి ‘జమీందారీ’లా భావించవద్దని హెచ్చరించారు. జిల్లా మేజిస్ట్రేట్‌లు, ఎస్పీలు, ఇతర అధికారులను మార్చవచ్చేమో గానీ ప్రజల మనసులను మార్చలేరని ఆమె అన్నారు.

ఎల్పీజీ కొరతపై కూడా మమతా బెనర్జీ స్పందించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ కొరత ఉందని చెబుతున్న వార్తలను ఆమె ఖండించారు. ఆయిల్ కంపెనీల సర్వర్లను నిలిపివేసి కృత్రిమంగా ఈ సంక్షోభాన్ని సృష్టించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రజలకు కిరోసిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మార్చి 14న ప్రధాని చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ప్రస్తావించారు. మా పార్టీ కార్యకర్తలపై దాడులు సహించం అన్న వ్యాఖ్యలు రాజ్యాంగానికి అనుగుణమా అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె అన్నారు. రాష్ట్ర మంత్రి శశి పంజా నివాసంపై దాడి జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, బీజేపీ నేతలను మమత హెచ్చరించారు. తమ పార్టీ ప్రతీకార రాజకీయాలకు దిగదని, కానీ బెంగాల్ ప్రజలను బెదిరించాలనుకుంటే అది సాధ్యం కాదని అన్నారు.

డబ్బులు ఇచ్చి సమావేశాలకు తీసుకొస్తున్నారు

బీజేపీ సమావేశాలకు ప్రజలను డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు జరిగిన ర్యాలీలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను కూడా ఆమె గుర్తు చేశారు. అంతేకాకుండా బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే కార్మికుల పరిస్థితిపై కూడా ఆమె ప్రశ్నించారు. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను బెంగాల్ స్వాగతిస్తుందని, కానీ బెంగాలీ కార్మికులు ఇతర రాష్ట్రాల్లో వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు. అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్), పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్సీ), జనగణన ప్రక్రియలను బీజేపీ ప్రజలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగిస్తోందని ఆరోపించారు. లక్షలాది ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. బెంగాల్ సంస్కృతి, చరిత్ర గురించి ప్రధానికి సరైన అవగాహన లేదని కూడా ఆమె విమర్శించారు. రాణీ రష్మోని, బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖుల పేర్లను కూడా తప్పుగా ఉచ్ఛరించారని అన్నారు. మహిళల భద్రత విషయమై కూడా మమత బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అనేక దాడులు జరిగాయని, మణిపూర్ ఘటనలపై కూడా కేంద్ర ప్రభుత్వం సరైన స్పందన ఇవ్వలేదని విమర్శించారు.

బీజేపీ బెంగాల్‌ వ్యతిరేకి: మమతా బెనర్జీ - Tholi Paluku