Let's talk: editor@tmv.in
బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తోంది: మమతా బెనర్జీ

బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తోంది: మమతా బెనర్జీ

Pinjari Chand
9 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీపై ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో మమతా మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై నేరుగా దాడి జరుగుతోందని అన్నారు. వన్ నేషన్, వన్ లీడర్, వన్ పార్టీ అనే భావజాలంతో బీజేపీ ప్రజాస్వామ్య సంస్థలను తమ రాజకీయ లక్ష్యాలకు వినియోగిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, జాతీయ కమిషన్లు, అలాగే మీడియాలోని కొంత భాగాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ఉపయోగిస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. ఎన్నికల జాబితాల నుంచి ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.భారత రాజ్యాంగ రూపకర్త బీఆర్.అంబేద్కర్‌‌ రూపొందించిన రాజ్యాంగ సూత్రాలను పక్కన పెట్టి, బీజేపీ తన పార్టీ మేనిఫెస్టోను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నదని మమతా విమర్శించారు. కోల్‌కత్తాలోని ధర్మతాలా ప్రాంతంలో తమ పార్టీ నిర్వహించిన ధర్నా ఈ చర్యలకు వ్యతిరేకంగా చేపట్టినదని తెలిపారు.

రాష్ట్రపతిపై మహువా మొయిత్రా విమర్శలు

ఇదే అంశంపై ఆల్ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యురాలు మహువామెయిత్రా కూడా స్పందించారు. భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము బీజేపీ చేస్తున్న ఆరోపణలను పునరావృతం చేస్తున్నారని ఆమె విమర్శించారు. దార్జిలింగ్‌లో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కార్యక్రమమని, ఆ కార్యక్రమ ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించలేదని మొయిత్రా తెలిపారు. అయితే భద్రతా ఏర్పాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే రాష్ట్రపతి కార్యాలయంతో చర్చలు జరిపిందని ఆమె చెప్పారు. తర్వాత ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్రంపై ఆరోపణలు చేయడం సరైంది కాదని మొయిత్రా పేర్కొన్నారు. రాష్ట్రపతి పదవిని మేము గౌరవిస్తున్నాం. కానీ మా రాష్ట్రం, మా ప్రజలపై ఆధారంలేని ఆరోపణలు చేయకూడదని ఆమె అన్నారు.ఇటీవల దార్జిలింగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ముర్ము, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరు విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ఈ వివాదం మరింత రాజకీయ రంగు పలుముకుంది. ప్రస్తుతం బీజేపీ–టీఎంసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.