Let's talk: editor@tmv.in
బీజేపీ పాలిత రాష్ట్రాల్లా కుల, మత ఘర్షణలు లేవు: సీఎం స్టాలిన్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లా కుల, మత ఘర్షణలు లేవు: సీఎం స్టాలిన్

Pinjari Chand
2 ఏప్రిల్, 2026

తమిళనాడులో కుల ఘర్షణలు, మతపరమైన అల్లర్లు లేవని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనిపించే పరిస్థితులు ఇక్కడ లేవని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే.స్టాలిన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉండటం వల్లే పెట్టుబడులు నిరంతరం వస్తున్నాయని ఆయన అన్నారు. తిరుచిరాపల్లి జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులను ఈ సందర్భంగా పరిచయం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడులో కుల ఘర్షణలు లేవు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగేలా మతపరమైన అల్లర్లు లేవు. ఉత్తరప్రదేశ్‌లో కనిపించే సామూహిక హింసా ఘటనలు, మణిపూర్‌లో ఉన్నట్లుగా నిరంతర ఉద్రిక్తతలు కూడా ఇక్కడ లేవు. అలాంటి పరిస్థితులు సృష్టించాలన్న బీజేపీ కుట్రలను మేము అడ్డుకున్నామని అన్నారు. రాష్ట్రంలో శాంతి, సమర్థ పాలన కొనసాగుతున్నందునే పెట్టుబడులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

మేం చేసేది మాత్రమే చెబుతాం

మేము చెప్పింది చేస్తాం, చేసేది మాత్రమే చెబుతాం. నేను ఎం.కరుణానిధి కుమారుడిని. పదేళ్లు అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే తమిళనాడును వెనక్కి నెట్టింది. బీజేపీ కూడా రాష్ట్రానికి సరైన నిధులు ఇవ్వలేదు. ఎడప్పాడి కే.పళనిస్వామి ప్రభుత్వం తన బంధువులకు కాంట్రాక్టులు ఇవ్వడానికే నడిచిందని విమర్శించారు. గత ఐదేళ్లలో తిరుచిరాపల్లి జిల్లాలో ప్రజల కోసం రూ.26 వేల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేశామని స్టాలిన్ తెలిపారు. మహిళలకు అందిస్తున్న మహిళల హక్కుల భత్యం, విద్యార్థులకు పోషకాహార బ్రేక్‌ఫాస్ట్ పథకం, యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించే ‘నాన్ ముదల్వన్’ పథకం విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా తమ ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీ చేస్తున్న డీఎంకే, మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో తిరుచిరాపల్లిలో డీఎంకే అన్ని స్థానాలు గెలుచుకుందని గుర్తుచేసిన ఆయన, ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని ప్రజలను కోరారు. ఆ విజయంతో జిల్లాకు ఇద్దరు మంత్రులు లభించారని అన్నారు. ఈ సందర్భంగా తిరుచిరాపల్లి వెస్ట్ నుంచి కె.ఎన్. నెహ్రూ, తిరువెరుంబూర్ నుంచి అన్బిల్ మహేష్ పొయ్యమొళి, తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి డా. ఇనిగో ఇరుడయరాజ్, శ్రీరంగం నుంచి ఎస్. దురైరాజ్, ముసిరి నుంచి కరుణైరాజ్, లాల్గుడి నుంచి పరివల్లల్, మనచనల్లూర్ నుంచి కథిరవన్, మనప్పరై నుంచి ఎంఎంకే అభ్యర్థి అబ్దుల్ సమద్‌లను ఆయన పరిచయం చేశారు. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.

బీజేపీ ‘కుట్రలను’ ఓడిస్తాం.. తమిళనాడు టీమ్ గెలుస్తుంది: ఉదయనిధి స్టాలిన్

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కుట్రలను ఓడించి డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు. తిరుపత్తూర్ జిల్లాలోని నాత్రంపల్లి, వాణియంబాడి ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెలుసుకుని, ఇతర మార్గాల్లో తమిళనాడులో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ నుంచి తమిళనాడును పాలించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. పాత, కొత్త బానిసల సహాయంతో ఇక్కడ అధికారంలోకి రావాలని చూస్తోంది. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వారి కుట్రలను ప్రజలే ఓడిస్తారు. మనం కష్టపడి పనిచేస్తే తమిళనాడు టీమ్ గెలిచి ‘ద్రావిడ మోడల్ 2.0’ పాలనను కొనసాగిస్తుందని ఆయన అన్నారు. డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా ఉన్న ఉదయనిధి పార్టీ ఎన్నికల హామీలను కూడా వివరించారు.