Let's talk: editor@tmv.in
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్‌నబిన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్‌నబిన్

Pinjari Chand
15 డిసెంబర్, 2025

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడిగా బీహార్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి నితిన్ నబిన్‌ను నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్థానంలో భవిష్యత్తులో నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నడ్డా జనవరి 2020 నుంచి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ, 2024 లోక్‌సభ ఎన్నికల వరకు పార్టీకి నాయకత్వం వహించేందుకు పదవీకాలంలో అనేక సార్లు పొడిగింపులు పొందారు.

45 ఏళ్ల నితిన్ నబిన్ కాయస్థ సముదాయానికి చెందినవారు. ఆయన ప్రముఖ బీజేపీ సీనియర్ నేత నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. పాట్నాలోని బాంకీపూర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబిన్, ప్రస్తుతం బీహార్‌లో పబ్లిక్ వర్క్స్ (రోడ్ కన్‌స్ట్రక్షన్) మంత్రిగా ఉన్నారు. గతంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, న్యాయ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

పార్టీలో బాధ్యతలు

యువ నాయకుడిగా గుర్తింపు పొందిన నితిన్ నబిన్‌కు పరిపాలనతో పాటు సంస్థాగత అనుభవం కూడా విస్తృతంగా ఉంది. బీజేపీ యువమోర్చాలో ఆయన కీలకంగా పనిచేశారు.

2008లో యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, యువ విభాగం సహ-ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

2010 నుంచి 2013 వరకు యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2016–2019 మధ్యకాలంలో బీహార్ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

2019లో సిక్కిం బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన ఆయన, అదే ఏడాది జూన్‌లో సిక్కిం రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు

అతను కష్టపడే కార్యకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అంకితభావంతో పనిచేశారు. అతని వినయం, ఉత్సాహం, శక్తి పార్టీని మరింత బలోపేతం చేస్తాయి అని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చాలి: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

బీహార్ గడ్డ నుంచి వచ్చిన యువ, ఉత్సాహభరిత నాయకుడు నితిన్ నబిన్‌కు హృదయపూర్వక అభినందనలు. ఆయన కష్టపడే కార్యకర్త, సృజనాత్మక ఆలోచనలు కలిగిన వ్యక్తి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన విజయవంతమవుతారు అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

పార్టీలో అత్యంత పిన్న వయసులో ఈ స్థాయి బాధ్యతలు చేపట్టిన నాయకుల్లో ఒకరిగా నితిన్ నబిన్ నిలిచారని బీజేపీ నేతలు తెలిపారు. పరిపాలన, సంస్థాగత నిర్మాణం రెండింటిలోనూ అనుభవం ఉన్న నాయకుడిగా ఆయన పార్టీకి కీలకంగా మారతారని వారు అభిప్రాయపడ్డారు.

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు ఉంటుంది:నితిన్ నబిన్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన అనంతరం బీహార్ మంత్రి నితిన్ నబిన్ తన స్పందనను వెల్లడించారు. ఈ పదవి తన వ్యక్తిగత విజయమేగాక పార్టీ కార్యకర్తల కష్టానికి వచ్చిన గుర్తింపుగా అభివర్ణించారు. ఇది పూర్తిగా పార్టీ కార్యకర్తల కృషి ఫలితం. ఒక అంకితభావంతో పనిచేసే కార్యకర్తగా ఉంటే, పార్టీ సీనియర్ నాయకులు ఆ కృషిని తప్పకుండా గమనిస్తారు. నేను ఎప్పటిలాగే పార్టీ నాయకత్వంతో కలిసి పనిచేస్తూ, పార్టీ లక్ష్యాల కోసం నిరంతరం శ్రమిస్తాను అని తెలిపారు.

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్‌నబిన్ - Tholi Paluku