
బీజేపీ నేతలు కేంద్రమంత్రి గడ్కరీతో హైదరాబాద్ మౌలిక సదుపాయాలపై సమావేశం
మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్‌లో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని బీజేపీఎల్పీ నేత, నిర్మల్ శాసనసభ్యులు ఆలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పాటిల్‌తో మర్యాదపూర్వకంగా కలిసిన నాగ్‌పూర్‌లోని మంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా,హైదరాబాద్ నగరంలో నిర్మాణమవుతున్న ఫ్లైఓవర్ల పురోగతి, నగర ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలపై నాయకులు కేంద్రమంత్రితో చర్చించారు.
హైదరాబాద్ ఒక విశ్వనగరంగా రోజురోజుకు విస్తరిస్తూ జనాభా కోటిని దాటిందని,అంతేకాక రోజూ మరో అర కోటి మంది ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం నగరానికి రాకపోకలు చేస్తున్నారుని,దీంతో ప్రజలు ట్రాఫిక్ జామ్‌లతో అష్టకష్టాలు పడుతున్నారని బీజేపీ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు.ఆఫీసులలో పని చేసే సమయం కంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే సమయమే ఎక్కువగా ఉందంటూ ప్రజలు వాపోతున్నారని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పనుల నత్తనడకపై ఫిర్యాదు
వరంగల్ హైవేపై నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్, నిజామాబాద్ హైవేపై సాగుతున్న కొంపల్లి ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని,ఇప్పటికే ఇచ్చిన డెడ్‌లైన్‌లు అన్నీ దాటిపోయాయని వారు వివరించారు. ఈ నేపథ్యంలో పనులను వేగవంతం చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.గడ్కరీ వెంటనే సానుకూలంగా స్పందించి, అధికారులతో త్వరలో సమగ్ర సమీక్ష నిర్వహిస్తానని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.
కొత్త ఫ్లైఓవర్ మంజూరు
అలాగే బాలానగర్–నరసాపూర్ హైవేపై ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం అవసరమని బీజేపీ నేతలు తెలిపారు. అదేవిధంగా నాగార్జునసాగర్ క్రాస్ రోడ్డు నుంచి అమరావతి వరకు నిర్మాణంలో ఉన్న కొత్త హైవే రాబోయే సంవత్సరాల్లో భారీ వాహన రద్దీకి దారితీయవచ్చని, అందువల్ల సాగర్ ఎక్స్ రోడ్ వైపూ ఫ్లైఓవర్‌ను మంజూరు చేయాలని మంత్రి గడ్కరీని కోరగా ఒప్పుకున్నారని త్వరలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి తెలిపారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
