Let's talk: editor@tmv.in
బీజేపీ నియంత్రణలో ఈసీ పనిచేస్తోంది: కేజ్రీవాల్

బీజేపీ నియంత్రణలో ఈసీ పనిచేస్తోంది: కేజ్రీవాల్

Pinjari Chand
9 ఏప్రిల్, 2026

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్‌ జాతీయ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం బీజేపీ నియంత్రణలో పనిచేస్తోందని మళ్లీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు, ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ప్రతినిధి బృందంతో ఎన్నికల సంఘం సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత వచ్చాయి. ఈ సమావేశంలో బెంగాల్ ఎన్నికలు భయం, హింస లేని వాతావరణంలో నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన కేజ్రీవాల్ ‘ఇక ఎన్నికల సంఘం బీజేపీ సూచనల మేరకు పనిచేస్తోందని చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు బహిరంగంగా కనిపిస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. అయితే ఇలాంటి భాషలో ట్వీట్ చేసి ముఖ్యమైన సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయకూడదు’ అని వ్యాఖ్యానించారు.

ఇక టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌ కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌‌తో జరిగిన సమావేశం కేవలం కొన్ని నిమిషాల్లో ముగిసిందని, తమను బయటకు వెళ్లమని చెప్పారని ఆరోపించారు. సమావేశం ఉదయం 10:02కు ప్రారంభమై 10:07కే ముగిసింది. మేము అధికారుల బదిలీల గురించి ప్రశ్నించగా అక్కడి నుంచి వెళ్లమన్నారు. ఇది సిగ్గుచేటు’ అని ఓబ్రియన్‌ మీడియాతో అన్నారు. సమావేశానికి సంబంధించిన వీడియో లేదా ఆడియో విడుదల చేయాలని కూడా ఆయన సవాల్ చేశారు. అయితే ఎన్నికల సంఘం వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఖండించాయి. సమావేశంలో అరవడం, అనుచితంగా ప్రవర్తించడం సరైంది కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ డెరిక్ ఓబ్రియన్‌కు సూచించినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛా, నిష్పక్షపాత వాతావరణంలో జరుగుతాయని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.

బీజేపీ నియంత్రణలో ఈసీ పనిచేస్తోంది: కేజ్రీవాల్ - Tholi Paluku