
బీజేపీ నితీశ్ కుమార్ ను వాడుకుంటోంది: తేజస్వీ యాదవ్
రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీశ్‌కుమార్‌ను సీఎం చేయబోమని బీజేపీ ఇప్పటికే నిర్ణయించేసిందని ఆర్జేడీ నేత, మహాఘట్భంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఆరోపించారు. మంగళవారం మహాఘట్భంధన్ తరఫున ‘బీహార్ క తేజస్వీ ప్రణ్’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో పత్రం విడుదల చేసిన ఆయన ఎన్డీయేపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా తేజస్వీ మాట్లాడుతూ నితీశ్‌కుమార్ ఇప్పుడు ఎన్డీయేకి కేవలం బొమ్మ మాత్రమే. బీజేపీ ఆయనను కేవలం ముఖచిత్రంగా వాడుకుంటోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. సీఎం ఎవరో ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని. అంటే నితీశ్ సీఎం కాదు అని అప్పుడే తేలిపోయింది అని వ్యాఖ్యానించారు.
తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన , మహాఘట్భంధన్ తో పోలిస్తే, ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించలేదని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా , మహాఘట్భంధన్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా పోలింగ్ జరిగేలా ఆదేశాలు వచ్చాయన్న సమాచారం ఉందని తేజస్వీ ఆరోపించారు. 1,500 కంపెనీల కేంద్ర బలగాలను నియమించడం వెనుక ఉద్దేశం ఇదేనని ఆయన వివరించారు. అధికారులను ఉద్దేశించి సత్యనిష్ఠతో పనిచేయండి, ఎవరి బలవంతానికి లోనుకావద్దు అని పిలుపునిచ్చారు. ఈసారి బీహార్ ప్రజలు మార్పు కోసం తహతహలాడుతున్నారు. నవంబర్ 6, 11న ఆ అవకాశం వస్తుంది. ఈసారి ప్రజలు దానిని వదులుకోరు అని నమ్మకంగా చెప్పారు.
‘ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం’ ముకేష్ సహాని
వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముకేష్ సహాని మాట్లాడుతూ బీహార్ అభివృద్ధికి 30–35 సంవత్సరాల దీర్ఘ ప్రణాళికతో ముందుకు వెళ్తాం. ప్రజల ప్రతి ఆకాంక్షను నెరవేర్చుతాం అన్నారు.
మహాఘట్భంధన్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే ప్రధాన హామీలు
ప్రభుత్వ ఏర్పాటైన 20 రోజుల్లో ‘ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం’ అనే చట్టం
‘మా–బెహన్ మాన్ యోజన’ కింద మహిళలకు నెలకు రూ.2,500 సాయం — డిసెంబర్ 1 నుంచి ఐదేళ్లపాటు
పాత పింఛన్ పద్ధతి పునరుద్ధరణ
వక్ఫ్ (సవరణ) చట్టం నిలిపివేత, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత
