
బీజేపీ నాయకులెప్పుడూ వర్తమానం గురించి మాట్లాడరు: ప్రియాంక గాంధీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా బచ్వారా లో బహిరంగ సభలో ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. దేశాన్ని బలహీనపరచి, ప్రజల మధ్య విభేదాలు పెంచే రాజకీయాలు బీజేపీ చేస్తోందని ఆమె ఆరోపించారు. శనివారం ఆమె ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ నేతలు ఎప్పుడూ గతం గురించి లేదా 2050లో ఏమవుతుందో దాని గురించి మాట్లాడుతారు. నెహ్రూ దీన్ని నాశనం చేశారు.'ఇందిరా గాంధీ దాన్ని నాశనం చేశారని మాట్లాడుతుంటారు. కానీ వారు మీ వర్తమానం గురించి మాట్లాడుతారా? ఈ ద్రవ్యోల్బణంలో మీరు ఎలా బతుకుతున్నారని వారు అడుగుతారా? కానీ నేటి పరిస్థితి గురించి ఎవరైనా అడుగుతున్నారా? బీహార్‌లో ఉద్యోగాలు లేవు, యువత వలస వెళ్లిపోతోంది. నేను కేరళ నుంచి కాశ్మీర్ వరకు చూసాను. బీహార్ ప్రజలు అక్కడా, ఇక్కడా కష్టపడి జీవనం సాగిస్తున్నారు అని ప్రియాంక అన్నారు.
ఆమె మాట్లాడుతూ ఈ భూమి పవిత్రమైనది. మహాత్మా గాంధీ బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ఇక్కడ నుంచే ప్రారంభించారు. ఆ పోరాటం రాజ్యాంగం కోసం సాగింది. అదే రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది. వాటిలో ప్రధానమైనది ఓటు హక్కు. కానీ ఇప్పుడు ఆ హక్కును కూడా ప్రమాదంలోకి నెట్టేశారు అని గుర్తు చేశారు. ప్రియాంక గాంధీ ‘ఓట్ చోరీ’ ఆరోపణలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో ఎన్డీయే లో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ 65 లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగించిందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచే కుట్ర అని ఆమె ఆరోపించారు. బీజేపీ చేసింది ప్రజలను బలహీనపరచడమే. వారు ఇరవై సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. మీ ప్రభుత్వం బలంగా లేదు, బలహీనంగా మారింది. వారు మీ ఓటును ప్రమాదంలో పడేశారు. వారు విభజన రాజకీయాలను అనుసరిస్తున్నారు. తద్వారా మతాల మధ్య, కులాల మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా, ఇక్కడ తప్పుడు జాతీయవాదం ప్రదర్శించబడుతోంది. మీ దృష్టి మరల్చడానికి, వారు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతారు. మీ హక్కులు తగ్గించబడుతున్నాయి. మీ హక్కులు తీసివేస్తున్నారు. మీరు పొందుతున్న అన్ని ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను బలహీనపరుస్తున్నారు. మీ దైనందిన జీవితంలో మీకు సహాయపడే పథకాలు, సౌకర్యాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతున్నారు అని ప్రియాంక వివరించారు. బీజేపీ పాలనలో ప్రజల హక్కులు తగ్గిపోయాయి. వారి తప్పుడు జాతీయత పేరుతో సామాజిక విభజన పెంచుతున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆమె వ్యాఖ్యానించారు.
బీహార్‌లో అభివృద్ధి లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ రాష్ట్రం గొప్ప చరిత్ర, సంస్కృతి కలిగినది. దేశానికి ఎంతోమంది నాయకులను,అధికారులును,కవులను ఇచ్చింది. అయినా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ముందుగా పాట్నా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, బీజేపీ వాగ్దానం చేసిన బీహార్‌లో ఒక కోటి ఉద్యోగాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇంత కాలం అన్ని ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికలు రాగానే ఎందుకు గుర్తొచ్చింది? అని ఆమె ప్రశ్నించారు. ప్రియాంకా గాంధీ బచ్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గరీబ్ దాస్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అదే విధంగా బెల్దౌర్‌లో పార్టీ అభ్యర్థి మిథిలేశ్ కుమార్ తరఫున కూడా సభ నిర్వహించనున్నారు.
