Let's talk: editor@tmv.in
బీజేపీ డీఎన్‌ఏలోనే ‘ఓటు చోరీ’: ఢిల్లీ సభలో రాహుల్ గాంధీ

బీజేపీ డీఎన్‌ఏలోనే ‘ఓటు చోరీ’: ఢిల్లీ సభలో రాహుల్ గాంధీ

Pinjari Chand
15 డిసెంబర్, 2025

దేశ ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పార్టీ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ‘ఓటు చోరీ’ ఉందని ఆరోపించిన ఆయన, ‘సత్యం’ మార్గంలో నడిచి నరేంద్ర మోడీ–ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి తప్పిస్తాం అని ప్రకటించారు. న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ ర్యాలీలో రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. మా వద్ద ‘సత్యం’ ఉంది… వారి వద్ద ‘సత్తా’ ఉంది. కానీ చివరకు గెలిచేది సత్యమే. బీజేపీ అధికారానికి చేరుకోవడానికి ఓటు చోరీనే మెట్లు అని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తోంది

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్ల పేర్లను ప్రస్తావించిన రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హర్యానా, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రశ్నలు అడిగినా, ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీహార్ ఎన్నికల సమయంలో రూ.10 వేల పంపిణీ జరిగినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదు. సత్యం–అసత్యం మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అండగా నిలుస్తోందని విమర్శించారు.

చట్టాన్ని వెనక్కి తీసుకుని చర్యలు చేపడతాం

ఎన్నికల సంఘానికి రక్షణ కల్పించేలా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ప్రస్తావించిన రాహుల్, అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుని, అవసరమైతే వెనుకకు వర్తించేలా (రెట్రోస్పెక్టివ్‌గా) మార్చి చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ మన దేశ సంస్కృతి, అన్ని మతాలు సత్యానికే ప్రాధాన్యం ఇస్తాయి. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం శక్తినే ముఖ్యమంటోంది. ఇది సత్యం–అసత్యం మధ్య పోరాటమన్నారు. పగ,హింసతో కాదు… సత్యం, అహింసతోనే మోడీ, అమిత్ షాలను ఓడిస్తాం అని స్పష్టం చేశారు.

ఆరు కోట్ల సంతకాలు

ఓటు చోరీపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సేకరించిన సుమారు ఆరు కోట్ల సంతకాలను త్వరలో రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు. దేశమంతటా ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ నినాదం వినిపిస్తోందని చెప్పారు. ఓటు చోరీ అనేది కేవలం ఎన్నికల్లో జరిగిన అక్రమం కాదు.. ఇది అంబేద్కర్ రాజ్యాంగంపై దాడి. ప్రతి పౌరుడికి ఒక ఓటు అనే మౌలిక హక్కును బీజేపీ కాలరాస్తోందని రాహుల్ ఆరోపించారు. చిన్న వ్యాపారాల నాశనం, తప్పుడు జీఎస్టీ విధానం, నిరుద్యోగం, కాలుష్యం వంటి సమస్యలన్నీ ఓటు చోరీ రాజకీయాల ఫలితమేనని వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంకగాంధీ ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ డీఎన్‌ఏలోనే ‘ఓటు చోరీ’: ఢిల్లీ సభలో రాహుల్ గాంధీ - Tholi Paluku