
బీజేపీ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా: కేంద్రమంత్రి బండి సంజయ్
గత పంచాయతీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నెరవేర్చారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల ప్రోత్సాహకం అందజేస్తానని ప్రకటించిన ఆయన, తాజాగా ఆ నిధులకు సంబంధించిన సర్క్యులర్ కాపీలను విడుదల చేశారు.
లబ్ధి పొందిన గ్రామాలు
మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు గ్రామస్థుల సమక్షంలో సర్పంచులు సామ రాజిరెడ్డి, కాతం (సాధుల) అమూల్య రాజశేఖర్ రెడ్డిలకు నిధుల పత్రాలను అందజేశారు.
గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీల అభివృద్ధి కోసం దశలవారీగా దాదాపు వెయ్యి కోట్లకుపైగా నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఆ నిధులతో అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తెచ్చి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 1203 పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున రూ.120 కోట్లు ఇస్తామని ప్రకటించి, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పి అమలు చేయలేదని అన్నారు. హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైన విషయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ల మధ్య తేడా లేదని బండి విమర్శించారు. గాంధీజీ ప్రతిపాదించిన ‘గ్రామ స్వరాజ్యం’ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని వ్యాఖ్యానించిన ఆయన, కేంద్రం అందిస్తున్న నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని పేర్కొన్నారు.
