Let's talk: editor@tmv.in
బీజేపీ అహంకారమే మాఘమేళా సంప్రదాయాన్ని భంగం చేసింది : అఖిలేశ్‌ యాదవ్‌

బీజేపీ అహంకారమే మాఘమేళా సంప్రదాయాన్ని భంగం చేసింది : అఖిలేశ్‌ యాదవ్‌

Pinjari Chand
29 జనవరి, 2026

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘమేళాలో శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పవిత్ర సంగమంలో స్నానం చేయకుండా వెళ్లిపోవడం అత్యంత అవమానకర సంఘటన అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు పాలక బీజేపీ అహంకారమే కారణమని ఆయన ఆరోపించారు. మౌని అమావాస్య సందర్భంగా సంగమంలో స్నానం చేయనీయలేదంటూ జనవరి 18 నుంచి శంకరాచార్య శిబిరం వెలుపల నిరసనకు దిగిన స్వామి అవిముక్తేశ్వరానంద, చివరకు భారమైన మనసుతో మాఘమేళా ప్రాంగణాన్ని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌ యాదవ్‌ ‘ఎక్స్‌’లో స్పందిస్తూ, ఆదికాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని బీజేపీ అహంకారం భగ్నం చేసిందన్నారు. ప్రయాగ్‌రాజ్‌ పవిత్ర భూమిలో జగద్గురు శంకరాచార్యులు పవిత్ర స్నానం చేయకుండా మాఘమేళాను వదిలి వెళ్లడం అత్యంత అశుభ సూచకమని పేర్కొన్నారు.

ఈ ఘటనతో సనాతన సమాజం మొత్తం బాధతో పాటు భయాందోళనలకు గురవుతోందని ఆయన అన్నారు. అధికార మత్తుతో బీజేపీ వ్యవహరించిందని విమర్శిస్తూ కావాలంటే శంకరాచార్యులు గౌరవంతో భుజాలపై ఎత్తుకుని సంగమంలో స్నానం చేయించవచ్చు. కానీ అధికార అహంకారం అడ్డొచ్చిందని వ్యాఖ్యానించారు. సాధువుల మనసులు గాయపరిస్తే శ్రేయస్సు కలగదని అఖిలేశ్‌ హెచ్చరించారు. సాధువుల గౌరవం కంటే గొప్ప పదవి ఏదీ లేదు. తప్పు చేసిన తర్వాత క్షమాపణ కోరకపోవడమే అతిపెద్ద తప్పు అని అన్నారు. సనాతన ధర్మంపై బీజేపీకి నిజమైన నిబద్ధత లేదని కూడా ఆయన విమర్శించారు. మతగ్రంథాలను ఉదహరిస్తూ అహంకారంతో తప్పులు చేసే వారు శిక్ష తప్పించుకోలేరని హెచ్చరించారు. సాదువులను బాధిస్తే అధికారానికి అంతమే అంటూ తన సందేశాన్ని ముగించారు.

ఇదిలా ఉండగా జనవరి 18న మౌని అమావాస్య సందర్భంగా శంకరాచార్యుడు పల్లకీలో సంగమానికి వెళ్లే ప్రయత్నం చేయగా, భారీ జనసందోహం కారణంగా కాలినడకన వెళ్లాలని అధికారులు సూచించడంతో వివాదం చెలరేగింది. శంకరాచార్యుడు, ఆయన అనుచరులు బారికేడ్లను దాటారని, దీంతో భద్రతా ఏర్పాట్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయని మేళా పరిపాలన వర్గాలు తెలిపాయి. ఈ పరస్పర ఆరోపణల మధ్యే శంకరాచార్యుడు పవిత్ర స్నానం చేయకుండా మాఘమేళాను విడిచిపెట్టారు.

ప్రభుత్వానికి ఆ అధికారం లేదు

ఇదే సంఘటనపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కూడా యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శంకరాచార్య బిరుదు విషయంలో స్వామి అవిముక్తేశ్వరానంద నుంచి ఆధారాలు కోరడం ‘అనుచితం’ అని ఆమె అన్నారు. శంకరాచార్య హోదాపై ప్రశ్నించే హక్కు శంకరాచార్య పీఠానికి లేదా పండితుల మండలికే తప్ప, ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అయితే తన వ్యాఖ్యలు సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకం కావని చెప్పారు. యోగి పట్ల తనకు గౌరవం, అభిమానం, సానుభూతి ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో, ధర్మ పరంపరలు, సంప్రదాయాల విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అన్న సంకేతం ఇచ్చారు.

బీజేపీ అహంకారమే మాఘమేళా సంప్రదాయాన్ని భంగం చేసింది : అఖిలేశ్‌ యాదవ్‌ - Tholi Paluku