Let's talk: editor@tmv.in
బీజేపీ అస్సాం వీడియోపై దుమారం

బీజేపీ అస్సాం వీడియోపై దుమారం

Pinjari Chand
9 ఫిబ్రవరి, 2026

అస్సాం బీజేపీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఒక వీడియోపై కాంగ్రెస్‌ పార్టీ, సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోలో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దగ్గర నుంచి కాల్చినట్లు చూపించడం అత్యంత ఆందోళనకరమని పేర్కొంటూ, దీనిపై న్యాయవ్యవస్థ తక్షణమే జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది. తరువాత తొలగించిన ఈ వీడియోలో, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తుపాకీతో గురి పెట్టి కాల్చినట్లు, ఒకరు స్కల్‌ క్యాప్‌ ధరించగా మరొకరికి గడ్డం ఉన్నట్లు చూపించారని కాంగ్రెస్‌ ఆరోపించింది. వీడియోకు ‘పాయింట్‌ బ్లాంక్‌ షాట్‌’ అనే శీర్షిక ఉండటం మరింత అభ్యంతరకరమని పేర్కొంది.

కాంగ్రెస్‌ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ఇది సాధారణ ట్రోల్‌ కంటెంట్‌ కాదు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న హింసకు పిలుపు ఇచ్చినట్టే. ఈ ఫాసిస్టు పాలన ఎన్నాళ్లుగానో పెంచుకుంటున్న ఆలోచనలకు ఇది ప్రతిబింబం. దీనిపై చర్యలు తప్పనిసరని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి స్పందన వచ్చే ఆశ లేదని, కనీసం న్యాయవ్యవస్థ అయినా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌ ప్రతినిధి సుప్రియా శ్రినేట్‌ మాట్లాడుతూ, వీడియోను తొలగించడం మాత్రమే సరిపోదని స్పష్టం చేశారు. ఇది బీజేపీ అసలు ముఖం. ఈ విద్వేషం, హింసకు బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. మరో కాంగ్రెస్‌ ప్రతినిధి షామా మహమ్మద్‌ కూడా ప్రధానిని ఉద్దేశించి స్పందిస్తూ, ‘సబ్కా సాథ్‌, సబ్కా వికాస్‌’ అంటూ మాట్లాడే బీజేపీ నేతలే ఇలాంటి వీడియోలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు మౌనంగా ఉండటం ఆశ్చర్యకరమని అన్నారు.

ఈ వ్యవహారంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా స్పందిస్తూ, తీవ్ర ద్వేషంతో కూడిన ఈ వీడియోను తొలగించినప్పటికీ, అప్పటికే అది విస్తృతంగా వ్యాపించిందని అన్నారు. ఇలాంటి అంశాలపై ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఈ వీడియో సామాజిక విభేదాలు, హింసను ప్రేరేపించే ప్రయత్నంగా అభివర్ణించిన కాంగ్రెస్‌ పార్టీ, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, శాంతి భద్రతలకు ముప్పుగా మారే ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టం చేసింది.

వీడియో తొలగింపు

ఫిబ్రవరి 7న బీజేపీ అస్సాం అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో తీవ్ర వివాదానికి దారి తీసింది. షూటింగ్‌ పోటీకి సంబంధించిన నిజమైన దృశ్యాలకు, స్కల్‌క్యాప్‌లు ధరించిన గడ్డం ఉన్న వ్యక్తుల చిత్రాలపై టార్గెట్లు జత చేసి, ‘ఫారినర్‌ ఫ్రీ అసోం’, ‘పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లలేదు?’ వంటి వాక్యాలను వీడియోలో ఉంచారు. ఈ వీడియోకు 10 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్‌, టీఎంసీ సహా ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది ముస్లింలపై విద్వేష ప్రసారం, హింసకు పిలుపు అంటూ వారు ఖండించారు. న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. వివాదం చెలరేగిన అనంతరం, వివరణ ఇవ్వకుండా ఆ వీడియోను తొలగించారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలపై అస్సాం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, రానున్న రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది.