Let's talk: editor@tmv.in
బీజేపీ 'అసెంబ్లీ ముట్టడి' ఉద్రిక్తం: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అరెస్ట్

బీజేపీ 'అసెంబ్లీ ముట్టడి' ఉద్రిక్తం: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అరెస్ట్

Gaddamidi Naveen
24 మార్చి, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను, మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ బీజేపీ సోమవారం చేపట్టిన 'అసెంబ్లీ ముట్టడి' కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రజలను అబద్ధపు హామీలతో వంచించిన నిరంకుశ పాలనపై నిరసన తెలిపేందుకు తరలివచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఎమర్జెన్సీ పాలన

అరెస్ట్ అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వెలుపల మీడియా ప్రతినిధులతో రామచందర్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచినా, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. 1975 నాటి నాటి ‘ఇందిరమ్మ’ ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తోంది. అరెస్టులు, నిర్బంధాలతో మా నిరసన గళాన్ని నొక్కలేరు అని ఆయన హెచ్చరించారు. 150 మంది మహిళలు సహా సుమారు 800 మంది కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రామచందర్ రావు పలు అంశాలను ప్రస్తావించారు. సుమారు 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా బకాయిలు లేక రైతులు, పెన్షన్ ప్రయోజనాలు అందక రిటైర్డ్ ఉద్యోగులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువ, దళిత, బీసీ డిక్లరేషన్ల పేరుతో ఓట్లు దండుకున్న కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత వారిని విస్మరించిందని ఆయ‌న ఆరోపించారు.

ఈ సందర్భంగా పలు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రామచందర్ రావుకు సంఘీభావం తెలిపారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేసే వరకు బీజేపీ తరపున ఈ 'ధర్మయుద్ధం' అలుపెరగకుండా కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులు తమ పోరాట పటిమను మరింత పెంచుతాయని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి త‌న ఎక్స్ వేదిక ద్వారా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? లేక పోలీస్ పాలన నడుస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. 6 గ్యారంటీలపై ప్రజలను మోసం చేసిన రేవంత్ సర్కారుకు సంక్షేమం కంటే కమిషన్ల మీదే శ్రద్ధ ఎక్కువని విమర్శించారు. అరెస్టులతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

ప్రశ్నిస్తే సంకెళ్లు వేయడం పిరికిపంద చర్య అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, అక్రమంగా నిర్బంధించిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అణచివేత ధోరణే ప్రభుత్వ పతనానికి నాంది అని ఆయ‌న‌ హెచ్చరించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటినా హామీలు నెరవేర్చని కాంగ్రెస్, ఇప్పుడు రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. గ్యారంటీలను అమలు చేసే వరకు కాంగ్రెస్‌ను ప్రతి అడుగులోనూ నిలదీస్తామని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న ఈ పోరాటం కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో దీనిని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.

బీజేపీ 'అసెంబ్లీ ముట్టడి' ఉద్రిక్తం: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అరెస్ట్ - Tholi Paluku