
బీజేపీ అధికారంలోకి వస్తే తినే తిండిపైనా ఆంక్షలే: మమతా
బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీ ప్రభుత్వంపై ఆయన విడుదల చేసిన ‘చార్జ్‌షీట్’కు ప్రతిస్పందిస్తూ చార్జ్‌షీట్ వేయాల్సింది మీపై అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పురులియా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ 2021 ఎన్నికల సమయంలో తాను ఎదుర్కొన్న కాలి గాయంపై వచ్చిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నేను కట్టుతో తిరుగుతున్నానని అంటున్నారు. డాక్టర్ రిపోర్ట్ చూడండి. నేను మరణం అంచుల నుంచి తిరిగి వచ్చానని పేర్కొన్నారు. తన గాయంపై వ్యాఖ్యానించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నా కాలు ఉద్దేశపూర్వకంగా గాయపరిచారా? నన్ను చంపాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యల్లో ఆమె నేరుగా అమిత్ షా పేరును ప్రస్తావించలేదు. అమిత్ షా టీఎంసీ ప్రభుత్వంపై చార్జ్‌షీట్ విడుదల చేయడాన్ని ఎత్తిచూపుతూ ఢిల్లీ నుంచి పెద్ద నాయకుడు వచ్చి చార్జ్‌షీట్ ఇచ్చారు. మీరెవరు చార్జ్‌షీట్ వేయడానికి? మీపైనే వేయాలంటూ మండిపడ్డారు. అమెరికాలో అక్రమ వలసలపై చర్యల సమయంలో భారతీయులను తిరిగి పంపిన ఘటనను ప్రస్తావిస్తూ గుజరాతీలను కట్టేసి పంపినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
అల్లర్లను రెచ్చగొట్టి అధికారం పొందుతున్నారు
ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అభ్యర్థి ఎవరనేది చూడాల్సిన అవసరం లేదు. నేనే మీ అభ్యర్థిని. నాపై నమ్మకం పెట్టి ఓటు వేయండని పిలుపునిచ్చారు. ఎన్ని కుట్రలు చేసినా టీఎంసీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు అందిస్తున్న ‘లక్ష్మీర్ భండార్’ పథకాన్ని నిలిపివేస్తుందని హెచ్చరించారు. ప్రజల ఆహార అలవాట్లపై కూడా నియంత్రణలు విధించే అవకాశం ఉందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపలు తినరు. ఒకవేళ వారు ఇక్కడ అధికారంలోకి వస్తే, ప్రజలు చేపలు, మాంసం, గుడ్లు తినలేరు. బీజేపీపై మరింత తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆ పార్టీ ఏ మతాన్నీ నిజంగా నమ్మదని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, కేంద్రంలోని అధికార పార్టీ అల్లర్లను రెచ్చగొట్టి అధికారాన్ని సాధిస్తుందని అన్నారు. ఈ వ్యక్తులు అల్లర్లను ప్రేరేపిస్తారు. ప్రజలను చంపి అధికారంలోకి వస్తారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. బెంగాలీ మాట్లాడే ప్రజలు కూడా హింసకు గురవుతున్నారు. కానీ బెంగాల్‌లో మేం ఎవరినీ అణచివేయమని స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు 1.2 కోట్ల ఓటర్ల పేర్లను తొలగించారంటూ ఎన్నికల ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనాభా మార్పులపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండిస్తూ అవి అసత్యమని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
హింసను ప్రోత్సహిస్తున్నారు
ఇక ముర్షీదాబాద్‌లో జరిగిన సభలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, బీజేపీతో పాటు హుమాయున్ కబీర్ పార్టీ మతపరమైన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజల జీవనోపాధి, అభివృద్ధి అంశాలను పక్కనపెట్టి మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. శ్రీ రామనవమి ఊరేగింపు సమయంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, హింసను ప్రోత్సహిస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. మందిరం, మసీదు పేరుతో ఓట్లు అడిగేవారు నైతికంగా దివాళా తీసినవారని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో సామాజిక సామరస్యాన్ని కాపాడుతామని, అన్ని పండుగలను కలిసి జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ టీఎంసీ–బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది.
