Let's talk: editor@tmv.in
బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది హెచ్‌.ఎస్‌. ఫూల్కా

బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది హెచ్‌.ఎస్‌. ఫూల్కా

Pinjari Chand
2 ఏప్రిల్, 2026

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, ఆమ్‌ ఆద్మీ పార్టీ మాజీ నేత హెచ్‌ఎస్‌.పూల్కా బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం సాధించేందుకు న్యాయపోరాటం చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి చెందారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి ఆయన చేరిక కీలక బలంగా భావిస్తున్నారు. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ , ఢిల్లీ మంత్రి మజిందర్‌‌ సింగ్‌ సిర్సా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్, పంజాబ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ జాకర్‌‌ , పార్టీ ప్రధాన ప్రతినిధి అనిల్‌ బలూని సమక్షంలో ఫూల్కా పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా హర్దీప్‌ సింగ్‌ పురి మాట్లాడుతూ ఫూల్కా చేరికతో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. 1984 అల్లర్ల బాధితులకు న్యాయం సాధించడంలో ఆయన చేసిన కృషి విశేషమని ప్రశంసించారు. పంజాబ్‌లో పార్టీ బలోపేతానికి ఆయన సేవలు ఉపయోగపడతాయని తెలిపారు.

తాను 1984 సిక్కు వ్యతిరేక హింస కేసుల్లో న్యాయపోరాటం చేస్తున్న సమయంలో బీజేపీ ఎప్పుడూ తనకు మద్దతుగా నిలిచిందని ఫూల్కా చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోనే పంజాబ్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సిక్కు సమస్యలపై ప్రధాని వ్యక్తిగతంగా ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. మదన్‌లాల్‌ ఖురానా, సుష్మా స్వరాజ్‌, విజయ్‌ కుమార్‌‌ మల్హోత్రా వంటి బీజేపీ నాయకులు కూడా 1984 అల్లర్ల బాధితుల తరఫున పోరాడారని గుర్తుచేశారు.

భావోద్వేగంలో ఆప్‌లో చేరాను

ఫూల్కా 2014లో ఆప్‌ తరఫున పంజాబ్‌లోని లూధియానా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2017లో పంజాబ్‌లోని ధాకా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది కొంతకాలం పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగానూ పనిచేశారు. అయితే 1984 కేసులపై న్యాయపోరాటం కొనసాగించేందుకు ఆ పదవికి రాజీనామా చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరడం తన తప్పిదమని అన్నారు. 2014లో అవినీతి వ్యతిరేక భావోద్వేగంతో ఆ పార్టీ దేశాన్ని మార్చగలదని భావించి చేరానని, కానీ తర్వాత పరిస్థితులు వేరుగా ఉన్నాయని తెలిసిందని చెప్పారు.

పంజాబ్‌ ప్రస్తుతం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ సమస్యలు, దందాలు, అవినీతి, మాదకద్రవ్యాల సమస్య, వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉన్నాయని అన్నారు. 2039 నాటికి పంజాబ్‌లో భూగర్భ జలాలు వినియోగానికి పనికిరాకపోయే పరిస్థితి వస్తుందనే నివేదికలు ఉన్నాయని తెలిపారు. పంజాబ్‌ను మళ్లీ సరైన దారిలో పెట్టాలంటే బీజేపీ మాత్రమే చేయగలదని, రాష్ట్ర అభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి పనిచేస్తానని ఫూల్కా చెప్పారు.

బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది హెచ్‌.ఎస్‌. ఫూల్కా - Tholi Paluku