Let's talk: editor@tmv.in
బీజేపీలో చేరిన నటి ఆమని

బీజేపీలో చేరిన నటి ఆమని

Gaddamidi Naveen
21 డిసెంబర్, 2025

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ నటి ఆమని శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొని అధికారికంగా బీజేపీలో చేరారు.

ఆమని తో పాటు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ శోభా లత కూడా బీజేపీలో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కళారంగంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం పార్టీకి బలం చేకూరుస్తుందని బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు.

1990ల దశకంలో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనాయికగా గుర్తింపు పొందిన ఆమని, కమల్ హాసన్, నాగార్జున అక్కినేని, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు వంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు. ‘శుభ సంకల్పం’, ‘శుభ లగ్నం’, ‘మిస్టర్ పెళ్లాం’, ‘ఘరానా బుల్లోడు’, ‘హలో బ్రదర్’ వంటి సినిమాలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. నటనకు గాను ఆమెకు అనేక ప్రశంసలు, అవార్డులు కూడా లభించాయి.

సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ ఆమని చురుకుగా పనిచేస్తున్నారు. ప్రజా జీవితంలో సేవ చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు ఆమె తెలిపారు. ఆమె చేరికతో తెలంగాణలో బీజేపీకి సినీ, సాంస్కృతిక వర్గాల్లో మరింత ఆదరణ పెరుగుతుందని పార్టీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

బీజేపీలో చేరిన నటి ఆమని - Tholi Paluku