Let's talk: editor@tmv.in
బీజేపీది భారత రాజ్యాంగాన్ని తొలగించాలనే ఆలోచన: రాహుల్ గాంధీ

బీజేపీది భారత రాజ్యాంగాన్ని తొలగించాలనే ఆలోచన: రాహుల్ గాంధీ

Pinjari Chand
24 డిసెంబర్, 2025

బీజేపీ భారత రాజ్యాంగాన్ని తొలగించే దిశగా ముందుకు వెళ్తోందని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగ భావనను బీజేపీ ఖండిస్తోందని విమర్శించారు. అధికార పార్టీని అధికారంలో నుంచి తప్పించేందుకు ప్రతిపక్షం సమర్థవంతమైన ప్రతిఘటన వ్యవస్థను నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత వారం జర్మనీలోని బెర్లిన్ హర్టీ స్కూల్‌లో విద్యార్థులతో జరిగిన సంభాషణలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంభాషణకు సంబంధించిన గంట నిడివి ఉన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి కేవలం భారత్‌కే పరిమితం కాదని, అది ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైన ప్రజాస్వామ్యం అయిన భారత్‌ ఒక గ్లోబల్ ఆస్తి అని ఆయన చెప్పారు.

‘రాజకీయాలు అంటే వినడం ఒక కళ’ అనే అంశంపై మాట్లాడిన ఆయన, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం కేవలం ఎన్నికల్లో సమస్య ఉందని చెప్పడానికే పరిమితం కాకుండా, దాన్ని ఎదుర్కొనే మార్గాలను కనుగొనాలని అన్నారు.

బీజేపీ ప్రతిపాదిస్తున్నది ఏమిటంటే రాజ్యాంగాన్ని తొలగించడం, రాష్ట్రాల మధ్య సమానత్వ భావనను రద్దు చేయడం, భాషలు, మతాల మధ్య సమానత్వాన్ని కూల్చివేయడం, ప్రతి వ్యక్తి సమాన విలువ కలవాడనే రాజ్యాంగ కేంద్ర భావనను చెరిపివేయడమని రాహుల్ గాంధీ ఆరోపించారు.

దేశంలో రాజ్యాంగ సంస్థలను పూర్తిగా ఆక్రమించే ప్రయత్నం జరుగుతోంది

మేం బీజేపీతో పోరాడటం లేదు. భారతదేశ సంస్థాగత వ్యవస్థను బీజేపీ స్వాధీనం చేసుకున్న విధానంతో మేం పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో ఎన్నికల యంత్రాంగంలో సమస్యలున్నాయని, అంతేకాదు దేశంలోని సంస్థలను పూర్తిగా ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని సంస్థలు తమ అసలు పాత్రను నిర్వర్తించడంలేదని, అవి ఆయుధాలుగా మారాయని వ్యాఖ్యానించారు.

యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్ నిర్మించడానికి ఎన్నో దశాబ్దాలు కష్టపడితే, భారత్ మాత్రం 1947లోనే రాజ్యాంగ ఆధారంగా రాజకీయ, ఆర్థిక సమాఖ్యను నిర్మించిందని గుర్తుచేశారు. ప్రపంచ ప్రజాస్వామ్యంపై చర్చ జరిగితే, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ను విస్మరించలేం. భారత ప్రజాస్వామ్యం ఒక గ్లోబల్ పబ్లిక్ గుడ్ అని అన్నారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని, అందులో ఎటువంటి సందేహం లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్ర ఎన్నికలు న్యాయంగా జరగలేదన్న భావన తమకు ఉందని అన్నారు.

ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సంస్థలు దేశానివి. కానీ బీజేపీ వాటిని తమ రాజకీయ శక్తి పెంచుకునేందుకు ఉపయోగిస్తోంది. ఎక్కువ కేసులు ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలపై మాట్లాడుతూ, అవి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విధానాలనే ముందుకు తీసుకెళ్లడమే తప్ప, కొత్త దారిని చూపడం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక మోడల్ ‘జామ్ అయిపోయింది’ అని అన్నారు.

ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ మౌలిక సిద్ధాంతాలతో మేమంతా ఏకీభవించం. ఆ విషయంలో మేం పూర్తిగా ఐక్యంగా ఉన్నాం. వ్యూహాత్మక విభేదాలు ఉన్నా, పార్లమెంటులో బీజేపీ తీసుకువచ్చే చట్టాలకు వ్యతిరేకంగా మేమంతా కలిసి పోరాడుతున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.

విదేశాల్లో భారత్‌ను దూషించే వేదికలపై రాహుల్ నిలుస్తున్నారు: బీజేపీ

జర్మనీలో భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. విదేశీ గడ్డపై భారత్‌ను దూషించే వ్యాఖ్యలు చేయడం ఇండియా-బాషింగ్కు నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా విమర్శించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పూనావాలా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తరచుగా భారత్ వ్యతిరేక ఆలోచనలు కలిగిన వ్యక్తులు, సంస్థలతో కలుస్తుంటారని ఆరోపించారు.

కొన్నిసార్లు కశ్మీర్ అంశంపై దేశానికి వ్యతిరేకంగా విషప్రచారం చేసే వారితో రహస్యంగా భేటీ అవుతారు. మరికొన్ని సార్లు విదేశాల్లో భారత్‌ను అపఖ్యాతి పాలు చేసే వేదికలపై నిలబడతారని వ్యాఖ్యానించారు.

హర్యానా ఎన్నికల్లో ఓ మహిళ 200 సార్లు ఓటు వేసిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పూనావాలా తీవ్రంగా ఖండించారు.

ఒక మహిళ పేరు 200 సార్లు ఓటర్ల జాబితాలో ఉందని కాదు, ఆమె 200 సార్లు ఓటు వేసిందని రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే శకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేసిందన్నారు. ఆ మహిళ వివరాలు ఏమిటో, ఆమె ఎలా 200 సార్లు ఓటు వేసిందో వెల్లడించాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు అసంబద్ధమైనవని, ఆధారాల్లేనివని ఆయన అన్నారు.

ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమగ్ర పునఃసమీక్ష (ఎస్ఐఆర్)ను రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని కూడా ప్రశ్నించారు. ఈవీఎంల్లోనే మోసం జరుగుతుందని అనుకుంటే, ఓటర్ల జాబితాపై ఇంత రాద్ధాంతం ఎందుకు? ఈవీఎంల్లో తారుమారు ఉంటే జాబితాపై ఆందోళన ఎందుకు? అని అడిగారు. ఈవీఎంల కారణంగానే బీజేపీకి ఓట్లు పెరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించడంపై స్పందించిన పూనావాలా , అదే ఈవీఎంలతో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు అవి సరిగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, జమ్మూ–కాశ్మీర్… కాంగ్రెస్ లేదా ప్రతిపక్షాలు గెలిచిన చోట ఈవీఎంలు బాగానే ఉంటాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈవీఎంలు సరిగానే ఉన్నాయి. కానీ ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలను తప్పుబడతారని విమర్శించారు.

2024లో కూడా ఓటమి తర్వాత మాత్రమే ఈవీఎంల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తడాన్ని సుప్రీంకోర్టు ‘ద్వంద్వ వైఖరి’గా వ్యాఖ్యానించిందని పూనావాలా గుర్తుచేశారు. రాహుల్ గాంధీ తన మిత్రపక్ష నేతల అభిప్రాయాలపై కూడా విశ్వాసం ఉంచడం లేదని ఆయన అన్నారు. ఒమర్ అబ్దుల్లా ఈవీఎంలను నిందించలేదు. ఎన్‌సీపీ నేత సుప్రియ సూలే పార్లమెంటులోనే ఈవీఎంల ద్వారా ఎన్నోసార్లు గెలిచానని చెప్పారు. మరి రాహుల్ గాంధీకి తన మిత్రులపై కూడా నమ్మకం లేదా? అని అడిగారు.

కాంగ్రెస్ పాలనలో జరిగిన ఎన్నికల అక్రమాలను ప్రస్తావించిన పూనావాలా,

1975లో ఇందిరాగాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు తేల్చింది. 1987 జమ్మూ–కాశ్మీర్ ఎన్నికలు దేశంలోనే అత్యంత రిగ్గింగ్ జరిగిన ఎన్నికలుగా గుర్తింపు పొందాయి. 1990లలో బూత్ క్యాప్చరింగ్ సాధారణంగా జరిగేది. ఆ కాలంలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేతలే ఒప్పుకున్నారు అని అన్నారు. విదేశాల్లో భారత్‌ను అపఖ్యాతి పాలు చేయడమే రాహుల్ గాంధీ అసలైన స్వరూపమని పూనావాలా తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఓడిపోయిన తర్వాత విదేశాలకు వెళ్లి భారత్‌పై దుష్ప్రచారం చేయడమే రాహుల్ గాంధీ నిజమైన వ్యక్తిత్వం అని అన్నారు.

బీజేపీది భారత రాజ్యాంగాన్ని తొలగించాలనే ఆలోచన: రాహుల్ గాంధీ - Tholi Paluku