
బీజేపీకి చెప్పకుండా ఎన్సీపీ విలీనమా?: ఫడ్నవీస్
ఎన్సీపీ విలీన చర్చలు తుది దశకు చేరి ఉంటే, ఉప ముఖ్యమంత్రి (మరణించిన) అజిత్ పవార్ ఆ విషయాన్ని తనకు తప్పకుండా చెప్పేవారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. బీజేపీకి తెలియకుండా ఎన్సీపీ విలీన ప్రక్రియ ముందుకు వెళ్లడం సాధ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడిన ఫడ్నవీస్, జనవరి 28న పుణె జిల్లా బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన విషయం ప్రస్తావిస్తూ, అజిత్ పవార్ ప్రతి విషయం నాతో పంచుకునేవారు. అంత కీలకమైన విలీన చర్చలు తుది దశలో ఉంటే నాకు తెలియకుండా ఉండేవి కావని అన్నారు.
ఇటీవల ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఫిబ్రవరి 12న ఎన్సీపీ రెండు వర్గాల విలీనాన్ని అధికారికంగా ప్రకటించేందుకు అజిత్ పవార్ తేదీ ఖరారు చేశారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే అజిత్ పవార్ అకాల మరణంతో ఆ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, జనవరి 17న శరద్ పవార్–అజిత్ పవార్ భేటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎన్సీపీ స్వతంత్ర పార్టీ
ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ స్పందిస్తూ ఫిబ్రవరి 12 తేదీ గురించి గానీ, శరద్ పవార్‌తో జరిగిన విలీన చర్చల గురించి గానీ నాకు ఎలాంటి సమాచారం లేదు. బీజేపీకి తెలియకుండా విలీన ప్రక్రియ తుది దశకు చేరుతుందా? అని ప్రశ్నించారు. ఎన్సీపీ ఒక స్వతంత్ర పార్టీ అని, తాము తీసుకునే నిర్ణయాలు వారి ఇష్టమేనని చెప్పిన ఫడ్నవీస్, అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో ఇటువంటి కీలక నిర్ణయాలపై సంప్రదింపులు జరగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అజిత్ పవార్ విలీనంపై పనిచేస్తూ ఉంటే, బీజేపీని నమ్మకంలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తారా? స్థిరంగా ఉన్న ఎన్డీయేను వదిలేలా ఆయన ఆలోచించేవారా?అని అన్నారు.
అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ శనివారం మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు ఎక్సైజ్, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి, వక్ఫ్ శాఖలు కేటాయించగా, అజిత్ పవార్ నిర్వహించిన ఆర్థిక–ప్రణాళిక శాఖలు మాత్రం అప్పగించలేదు. ప్రస్తుతం ఆర్థిక శాఖను స్వయంగా తన వద్దే ఉంచుకున్న ఫడ్నవీస్, తానే రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతానని చెప్పారు. బడ్జెట్ అనేది కేవలం ప్రసంగం కాదు. అనేక శాఖలతో సమావేశాలు జరపాల్సిన పెద్ద ప్రక్రియ. వెంటనే ఆ బాధ్యత సునేత్ర పవార్ నుంచి ఆశించడం సరికాదు. బడ్జెట్ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారంపై జరుగుతున్న విమర్శలకు స్పందిస్తూ, నిర్ణయాలు పరిస్థితుల ఆధారంగా తీసుకోవాల్సి వస్తాయని అన్నారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం ఆమె అంత్యక్రియలకు ముందే రాజీవ్ గాంధీ ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. అజిత్ పవార్ మరణాన్ని దృష్టిలో ఉంచుకుని, ఫిబ్రవరి 7న జరిగే జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని ఫడ్నవీస్ తెలిపారు. ఈ సమయంలో రాజకీయ వ్యాఖ్యలు తలెత్తకుండా జాగ్రత్త అవసరమని ఆయన అన్నారు. ముంబైలో దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పుల ఘటనపై కూడా సీఎం స్పందించారు. దుండగులు ఉపయోగించిన స్కూటీని గుర్తించామని, సంబంధిత వ్యక్తిని కూడా గుర్తించినట్లు వెల్లడించారు.
