Let's talk: editor@tmv.in
బీజేపి సీనియర్ నేత మృతి: ప్రధాని సంతాపం

బీజేపి సీనియర్ నేత మృతి: ప్రధాని సంతాపం

Pinjari Chand
1 అక్టోబర్, 2025

బీజేపీ ఢిల్లీ తొలి అధ్యక్షుడు విజయ్​కుమార్ మల్హోత్రా మరణం పట్ల ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. ఆయన మరణం చాలా బాధకరమైందని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఎయిమ్స్​లో చికిత్సపొందుతూ 93 సంవత్సరాల వయస్సులో మరణించారు. మల్హోత్రా జీ అత్యుత్తమ నాయకుడిగా, పార్లమెంట్​లోనూ పార్టీ తరపున కీలక పాత్ర పోషించారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ బలోపేతానికి ఆయన కృషి చేశారని, ప్రజా సమస్యలపై నిరంతంర పోరాడారని, సమస్యలపై విస్తృతమైన అవగాహన కలిగి ఉండేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఆయనతో ఉన్న రోజులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఎక్స్​లో నాటి జ్ఞాపకాలను పోస్ట్​ చేసి ప్రజలతో పంచుకున్నారు.

ఆయన మృతి బాధాకరమని, పార్టీ ఢిల్లీలో ఎదగడానికి కృషి చేశారని, అత్యంత కష్ట సమయంలోనూ పార్టీ పట్ల నిబద్ధతతో మెలిగారని ఢిల్లీ బీజేపీ యూనిట్​ గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ అభిమానులకు సానుభూతిని ప్రకటించింది. అలాగే బీజేపీ కుటుంబం మొత్తం ఆయన కుటుంబానికి అండగా నిలుస్తోందని, ఆయన ఆత్మకు దేవుడు శాంతి ప్రసాదించాలని వేడుకున్నారు.

1931వ సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్​ లోని లాహోర్​లో విజయ్​మల్హోత్రా జన్మించారు. తండ్రైన కవిరాజ్ ఖాజన్​ చంద్​ ఆయుర్వేద వైద్యుడు. ఈయనకు ఏడుగురు సంతానం. అందులో ఈయన నాల్గవవాడు. ఢిల్లీ ప్రదేశ్​ జనసంఘ్​ అధ్యక్షుడిగా 1972–75 వరకు పనిచేశారు. తరువాత రెండు సార్లు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రదేశ్​ (1977-80, 1980-84) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జన్​ సంఘ్​ జనతా పార్టీగా రూపాంతరం చెందండంలో కీలకపాత్రం పోషించారు. అలాగే ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. ఇందిరా గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించి దాదాపు 19 నెలలు జైలు జీవితం గడిపారు. కేదార్ నాథ్ సాహ్ని, మదన్​ లాల్​ ఖురానా వంటి నాయకులతో కలిసి బీజేపీ విస్తరణలో భాగస్వాములయ్యారు. దశాబ్దాలపాటు పనిచేసి బీజేపీకి కొత్త ఊపును తీసుకొచ్చారు. 1999 లొక్ సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ ను భారీ మెజార్టీతో ఓడించి గెలుపు సాధించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది. తన రాజకీయ జీవితంలో 1977లో మొదటిసారిగా దక్షిణ ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు.

ఆ తర్వాత 1989, 1999, 2004లలో మొత్తం నాలుగుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. అలాగే 1994లో రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. పలు పార్లమెంటరీ కమిటీలలో పనిచేసిన విశేష అనుభవం గడించారు. రెండు సార్లు ఢిల్లీలో ఎమ్మెల్యేగా పని చేశారు. దీంతో ఆయన బీజేపీలో అత్యంత సీనియర్​ నేతగా గుర్తింపుపొందారు. అయితే 2004 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఎకైక బీజేపీ ఎమ్మెల్యేగా నిలిచారు. తన రాజకీయ జీవితంతో ఎటువంటి కళంకం లేకుండా ప్రజాజీవితాన్ని కొనసాగించారు. సాహిత్యంలోనూ ఆయనకు మంచి పేరుంది. సామాజిక సేవలో, క్రీడా క్లబ్​ లలో ఆయన చురుకుగా పాల్గోనేవారు. ఎయిమ్స్​ లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన మరణించారని ఎయిమ్స్​ అధికారులు దృవీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధకృష్ణన్​, కేంద్ర హోంమంత్రులు అమిత్​ షా, రాజ్ నాథ్​ సింగ్, నడ్డా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతాపం తెలిపారు.​

బీజేపి సీనియర్ నేత మృతి: ప్రధాని సంతాపం - Tholi Paluku