
బీజాపూర్ ఎన్‌కౌంటర్ లో ఉన్నది వీరే
ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిధిలోని కందుల్నార్, కచ్లారం అడవుల్లో నవంబర్ 11న సెక్యూరిటీ బలగాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు నక్సలైట్‌లు మరణించారు. వీరిపై మొత్తం రూ.27 లక్షల రివార్డు ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో ఇద్దరు టాప్ మావోయిస్ట్ నేతలు ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. వారిలో ఉర్మిళ (పాపారావు భార్య), పామేడ్ ఏరియా కమిటీ సెక్రటరీ, అలాగే బుచన్న కుడియం అలియాస్ కన్నా (35), మడ్డెడ్ ఏరియా కమిటీ ఇన్‌చార్జి ఉన్నారు.
దశాబ్దం పాటు భయపెట్టిన బుచన్న
గత దశాబ్దంలో దక్షిణ బస్తర్‌లో జరిగిన పలు పెద్ద దాడుల వెనుక మాస్టర్‌మైండ్‌గా ఉన్న ఈ ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. సుమారు ఆయన పై రూ.8 లక్షల రివార్డు ఉంది. 42 కేసులు, 18 అరెస్ట్ వారెంట్లు అతడిపై ఉన్నాయని ఎస్పీ యాదవ్ వెల్లడించారు. 2008లో కోంగుపల్లి పోలీస్ పోస్ట్ పై దాడి, 2016లో నుక్నార్పాల్ క్యాంప్ దాడిల్లో అతని పాత్ర ఉందని పోలీసులు చెప్పారు. గ్రామస్తులను పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా ముద్ర వేసి కనీసం 20 మందిని హత్య చేశాడని, పలు వాహనాలు, మొబైల్ టవర్లు కాల్చివేశాడని వివరించారు.
కమాండర్ గా ఉర్మిళ
ఉర్మిళపై రూ.8 లక్షల రివార్టు ఉండేది. ఆమె పామేడ్ ఏరియా కమిటీ సెక్రటరీగా, అలాగే పీఎల్జీఏ బెటాలియన్‌కు అవసరమైన వస్తువుల సరఫరాలు (రేషన్, మందులు, యూనిఫాంలు మొదలైనవి) అందించే బాధ్యత వహించేది.
ఆమె మృతి మావోయిస్ట్ లాజిస్టిక్ నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బగా మారిందని పోలీసులు చెప్పారు.
ఇంకా నలుగురి గుర్తింపు
ఇతర నలుగురిలో ఏరియా కమిటీ మెంబర్ జగత్ టామో అలియాస్ టామో (రూ.5 లక్షల రివార్టు), అలాగే ప్లాటూన్ సభ్యులు దేవే, భగత్, మాంగ్లీ ఒయం (రూ.2 లక్షలు ) ఉన్నారని ఎస్పీ వివరించారు.
ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి పోలీసు బలగాలు రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక 9మిమీ కార్బైన్, 303 రైఫిల్, ఒక సింగిల్‌షాట్ రైఫిల్, 12 బోర్ గన్, రేడియో సెట్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు, మావోయిస్ట్ సాహిత్యం, మెడికల్ వస్తువులు స్వాధీనం చేసుకున్నాయి.
మావో హింసకు ముగింపు దిశగా..
ఈ ఏడాది ఇప్పటివరకు బీజాపూర్ జిల్లాలో 144 మంది నక్సల్స్ హతమయ్యారు. 499 మంది అరెస్టయి, 560 మంది లొంగిపోయారని పోలీసులు తెలిపారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ మాట్లాడుతూ ఈ 20 నెలల్లో 447 మంది మావోయిస్ట్ మృతదేహాలు లభించాయి. ఇప్పుడు బస్తర్ పూర్తిగా మావో రహిత ప్రాంతంగా మారడానికి సమయం దగ్గరలో ఉంది. మావోయిస్ట్ సంస్థ పూర్తిగా క్షీణ దశకు చేరింది. వారు ఇప్పుడు హింసా మార్గం వదిలి ప్రధాన ప్రవాహంలోకి రావాల్సిందే అని పేర్కొన్నారు.
