Let's talk: editor@tmv.in
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతం

బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతం

Pinjari Chand
18 జనవరి, 2026

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టు కేడర్లు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఏకే–47 వంటి గ్రేడెడ్ ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జిల్లా వాయవ్య ప్రాంతంలోని అటవీ, కొండ ప్రాంతాల్లో ఉదయం సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సలైట్ల కదలికలపై లభించిన సమాచారం మేరకు భద్రతా దళాలు చేపట్టిన నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఎస్సీ తెలిపిన వివరాల ప్రకారం, మావోయిస్టుల నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన డివిజనల్ కమిటీ మెంబర్ (డీవీసీఎం) దిలీప్ బెడ్జా సహా ఇతర సాయుధ మావోయిస్టులు అడవి, కొండ ప్రాంతాల్లో ఉన్నారన్న సమాచారం మేరకు డీఆర్‌జీ, కోబ్రా, ఎస్టీఎఫ్ బృందాలు సంయుక్తంగా శోధన ఆపరేషన్ చేపట్టాయి. జనవరి 17 ఉదయం నుంచి మావోయిస్టులతో అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయి. విచారణలో నలుగురి మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకరు డీవీసీఎం దిలీప్ బెడ్జా కావచ్చని ప్రాథమికంగా గుర్తించారు. దిలీప్ బెడ్జా మావోయిస్టుల నేషనల్ పార్క్ ఏరియా కమిటీలో చురుకుగా పనిచేస్తూ, అనేక దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాట్టిలింగం మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లోనూ భద్రతా దళాలు ధైర్యంగా, అంకితభావంతో మావోయిస్టులపై ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో శోధన చర్యలు కొనసాగుతున్నాయి. జనవరి 3న బస్తర్ ప్రాంతంలో (బీజాపూర్ సహా 7 జిల్లాలు) జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో 14 మంది నక్సలైట్లు హతమయ్యారు. గత సంవత్సరం మొత్తం ఛత్తీస్‌గఢ్‌లో 285 మంది నక్సలైట్లు భద్రతా దళాల ఎన్‌కౌంటర్లలో మరణించారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నాటికి లెఫ్టిస్ట్ తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే.

ఈ ఎన్ కౌంటర్ లో సీనియర్ మావోయిస్టు కమాండర్ పాపారావు అలియాస్ మోంగు అక్కడ ఉన్నాడన్న పక్కా రహస్య సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , స్పెషల్ టాస్క్ ఫోర్స్ , సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఎలైట్ యూనిట్ కోబ్రా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. బీజాపూర్ జిల్లా వాయవ్య ప్రాంతంలోని అటవీ, కొండ ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు రావాల్సి ఉందని తెలిపారు.

పాపారావు ప్రొఫైల్

పాపారావు అలియాస్ మోంగు (57) తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. సీపీఐ (మావోయిస్టు) పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఇతడిపై రూ.50 లక్షల రివార్డు ఉంది. గత 20 ఏళ్లకు పైగా బస్తర్ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నాడు. అతడు డండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉండటంతో పాటు, మావోయిస్టుల ఎంఓపీఓఎస్ శిక్షణ విభాగంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.

కీలక దాడుల్లో పాత్ర

పాపారావుపై 2010లో జరిగిన దంతేవాడ సీఆర్పీఎఫ్ మారణహోమం, ఇతర పలు పెద్ద నక్సలైట్ దాడుల్లో ప్రత్యక్షంగా లేదా ప్రణాళికా స్థాయిలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

గత ఎన్‌కౌంటర్ లో మిస్

నవంబర్ 2025లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్ సమయంలో పాపారావు తప్పించుకోగా, అతని భార్య ఉర్మిలను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. అప్పటి నుంచి అతడిపై గాలింపు మరింత ముమ్మరం చేశాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్చి గడువులోపు లెఫ్టిస్ట్ తీవ్రవాద నిర్మూలన లక్ష్యంలో భాగంగా పాపారావును కీలక లక్ష్యంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ ప్రాంతంలో విస్తృత స్థాయి శోధన, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు సూచించాయి.

బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతం - Tholi Paluku