
బీజాపూర్‌లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో 41 మంది నక్సలైట్లు బుధవారం అధికారుల ముందు లొంగిపోయారు. వీరిలో 32 మందిపై మొత్తం రూ.1.19 కోట్ల రివార్డు ఉండింది. వీరిలో 12 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొత్త లొంగుబాటు, పునరావాస విధానాలు, బస్తర్ రేంజ్ పోలీసు ‘పూనా మార్గం’ కార్యక్రమం ప్రభావంతోనే తమ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ సమాచారాన్ని బీజాపూర్ ఎస్‌పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు.
లొంగిపోయిన వారిలో పలువురు పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్ నంబరు–1, వివిధ కంపెనీల సభ్యులు ఉన్నారు. ముగ్గురు ఏరియా కమిటీ సభ్యులు, 11 మంది ఏరియా, ప్లాటూన్ కమాండర్లు, ఇద్దరు పీఎల్జీఏ సిబ్బంది, నలుగురు మిలీషియా ప్లాటూన్ కమాండర్లు, ఒక డిప్యూటీ కమాండర్, ఆరుగురు మిలీషియా ప్లాటూన్ సభ్యులు, మిగతావారు నిషేధిత సీపీఐ (మావోయిస్టు) అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్నవారుగా పోలీసులు గుర్తించారు. 39 మంది దక్షిణ సబ్ జోనల్ బ్యూరోతో అనుబంధం కలిగివుండగా, దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ధమ్తరి–గారియాబంద్–నవపాడా డివిజన్లతో పనిచేసినట్టు అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు భారత రాజ్యాంగంపై నమ్మకం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవప్రదంగా జీవిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస విధానంలో భాగంగా ఒక్కొక్కరికి వెంటనే రూ.50,000 ఆర్థిక సాయం అందజేశారు.
రూ.8 లక్షల రివార్డు ఉన్న కీలక నాయకులు
పాండ్రు హప్కా అలియాస్ మోహన్ (37), బండి హప్కా (35), లక్కు కోర్సా (37), బడ్రు పునేం (35), సుఖ్‌రాం హేమ్లా (27), మంజుల హేమ్లా (25), మంగళి మడవి అలియాస్ శాంతి (29), జైరం కడియం (28), పాండో మడ్కం అలియాస్ చందినీ (35)పై ఒక్కొక్కరిపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఇంకా ముగ్గురిపై రూ.5 లక్షలు, 12 మందిపై రూ.2 లక్షలు, మరో 8 మందిపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు ఎస్‌పీ తెలిపారు.
హింస విడిచేయాలని విజ్ఞప్తి
హింసను, జీవితాన్ని దారి తప్పించే సిద్ధాంతాల్ని వదిలి భయం లేకుండా సమాజంలోకి తిరిగి రండి. పూనా మార్గం కార్యక్రమం సురక్షితమైన భవిష్యత్తుకు మార్గం చూపిస్తోంది అని ఎస్‌పీ యాదవ్ మిగతా మావోయిస్టులను కోరారు. కేవలం బీజాపూర్‌లోనే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 790 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఇదే సమయంలో వేర్వేరు ఎదురు కాల్పుల సంఘటనల్లో 202 మంది మరణించారు. 1,031 మంది అరెస్టు అయ్యారు. గత 23 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,200 మందికి పైగా మావోయిస్టులు లొంగినట్టు పోలీసులు వెల్లడించారు.
