
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్:ఆరుగురు మావోయిస్టులు హతం
దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన మావోయిస్టలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఈ రోజు ఉదయం మొదలైన ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లా మోడక్‌పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుల్నార్ గ్రామానికి పశ్చిమాన సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో భద్రతా దళాలు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగా సంఘటన స్థలంలో దొరికిన ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు దాగి ఉన్నారనే అనుమానంతో సెర్చ్, కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
బీజాపూర్ పోలీసుల ప్రకారం జిల్లాలో పలు సెక్యూరిటీ ఫోర్సుల బృందాలు ప్రస్తుతం యాక్టివ్‌గా యాంటీ-నక్సల్ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయని తెలిపారు. ఇక్కడ మావోయిస్టులందరినీ పూర్తిగా నిర్మూలించే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని సెక్యూరిటీ వర్గాలు పేర్కొన్నాయి.
