
బీఎస్ఎఫ్‌లో 391 కానిస్టేబుల్ పోస్టులు
దేశ సేవలో పాలుపంచుకోవాలనుకునే ప్రతిభావంతులైన క్రీడాకారులకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) శుభవార్త అందించింది. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 391 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 16 నుండి బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 4.
మొత్తం 391 ఖాళీల్లో పురుషులకు 197 పోస్టులు, మహిళలకు 194 పోస్టులు కేటాయించారు. అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్ పూర్తిగా స్పోర్ట్స్ కోటా కింద జరుగుతున్నందున అభ్యర్థులు గుర్తింపు పొందిన జాతీయ/అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని ఉండాలి లేదా పతకాలు గెలుచుకుని ఉండాలి. దరఖాస్తు గడువు తేదీకి ముందు గత రెండు సంవత్సరాలలో సాధించిన క్రీడా విజయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ఇక అభ్యర్థుల వయో పరిమితి విషయానికి వస్తే ఆగస్టు 1, 2025 నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.159గా ఉంది. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
వేతనం
కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు 7వ కేంద్ర పే కమిషన్ లెవల్ - 3 వేతనం లభిస్తుంది. అంటే నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వరకు జీతం వస్తుంది. బేసిక్ పేతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే హెచ్‌ఆర్‌ఏ, డీఏ, టీఏ, ఇతర అలవెన్సులు కూడా అదనంగా లభిస్తాయి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులు, క్రీడా సర్టిఫికెట్లను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. క్రీడల్లో సాధించిన విజయాలు, అన్ని పరీక్షలలో సాధించిన అర్హత ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.
దేశ సరిహద్దు భద్రతా దళంలో గౌరవప్రదమైన ఉద్యోగాన్ని పొందాలనుకునే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇది గొప్ప అవకాశం. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ ను సందర్శించండి.
బీఎస్ఎఫ్ గురించి..
బీఎస్ఎఫ్‌ను 1965 డిసెంబర్ 1న స్థాపించారు. ఇది భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. బీఎస్ఎఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా దళాలలో ఒకటి. ఇందులో సుమారు 2.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
కానిస్టేబుల్ కెరీర్, ప్రమోషన్లు
కానిస్టేబుల్ (జీడీ)గా బీఎస్ఎఫ్‌లో చేరిన అభ్యర్థులు లెవెల్-3 (రూ.21,700-రూ.69,100) వేతనం పొందుతారు. కానిస్టేబుల్‌గా చేరినవారు తమ సర్వీస్, అర్హత ఆధారంగా డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ పరీక్షలు, సుదీర్ఘ సర్వీస్ తర్వాత పైస్థాయిలకు ప్రమోషన్ పొందడానికి అవకాశాలు ఉంటాయి. సాధారణంగా కానిస్టేబుల్.. హెడ్ కానిస్టేబుల్‌గా, ఆ తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా, తర్వాత సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందుతారు. స్పోర్ట్స్ కోటా ద్వారా వచ్చినవారు తమ క్రీడా నైపుణ్యాలను కొనసాగిస్తూనే, దేశ రక్షణ విధుల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు.
