Let's talk: editor@tmv.in
బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్‌పై చర్యలు తప్పవు: సింధియా

బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్‌పై చర్యలు తప్పవు: సింధియా

Pinjari Chand
26 ఫిబ్రవరి, 2026

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) డైరెక్టర్ వివేక్ బంజాల్ ప్రయాగ్‌రాజ్ పర్యటన సందర్భంగా భారీ స్థాయిలో అధికారులను ప్రోటోకాల్ విధుల్లో నియమించిన ఘటనపై కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ప్రతినిధులతో మాట్లాడిన సింధియా, ఈ వ్యవహారం నియమాలు, పరిపాలనా సంప్రదాయాలకు విరుద్ధమని, పూర్తిగా అనుచితమని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో ఇలాంటి ప్రవర్తన నియమాలకు విరుద్ధమైందని, ఇది షాకింగ్ అని వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా అనుచితం. విధించిన నియమాలు, సంప్రదాయాలకు విరుద్ధం. నాకు అసహ్యంగా అనిపించింది. 21వ శతాబ్దంలో ఇలా ప్రవర్తించలేం. ఇది షాకింగ్. ఇప్పటికే డైరెక్టర్‌కు షో-కాజ్ నోటీసు జారీ చేశాం. ఏడురోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరాం. ఆయన వివరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని సింధియా తెలిపారు.

ఇదిలా ఉండగా బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ చర్యలను ప్రభుత్వం అత్యంత సీరియస్ గా పరిగణిస్తోంది. చట్టపరమైన మార్గదర్శకాలు, ప్రోటోకాల్‌లు, పరిపాలనా సంప్రదాయాలకు విరుద్ధంగా ఈ చర్యలు ఉన్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలో క్రమశిక్షణ, ప్రోటోకాల్‌కు కట్టుబాటు అత్యంత ముఖ్యమని, ఈ ప్రమాణాలకు భిన్నంగా జరిగే ప్రవర్తన పరిపాలన విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని తెలిపింది. ఫిబ్రవరి 25న వివేక్ బంజాల్ ప్రయాగ్‌రాజ్ పర్యటనకు షెడ్యూల్ ఖరారు కాగా, దానికి ముందు ఫిబ్రవరి 19న ప్రయాగ్‌రాజ్ డీజీఎం కార్యాలయం దాదాపు 50 మంది అధికారులు, సిబ్బందిని ప్రోటోకాల్ విధుల్లో నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై విధివిధానాల ప్రకారం దర్యాప్తు కొనసాగుతుందని, తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.