Let's talk: editor@tmv.in
బీఎల్వోల మరణాలపై బీజేపీపై ఖర్గే ఫైర్

బీఎల్వోల మరణాలపై బీజేపీపై ఖర్గే ఫైర్

Pinjari Chand
24 నవంబర్, 2025

దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కారణంగా బూత్ లెవల్ ఆఫీసర్లపై (బీఎల్వో)పని ఒత్తిడి పెరిగి, ఆత్మహత్యలకు దారి తీస్తోందన్న ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.కేరళలోని కన్నూర్‌లో ఒక బీఎల్వో ఆత్మహత్య చేసుకుని మరణించడంతో వివాదం చెలరేగింది , ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ వివాదం కాస్తా రాజకీయ రంగు పులుముకున్నది. దీంతో ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీని తీవ్రంగా తప్పుబట్టారు. ఆరు రాష్ట్రాల్లో 16 బీఎల్వోలు మరణించారని వెల్లడించిన ఒక మీడియా నివేదికను ఎక్స్‌లో షేర్ చేసిన ఖర్గే, బీజేపీపై పదునైన విమర్శలు గుప్పించారు.

ఎన్నికల కమిషన్ మౌనంగా చూస్తోంది

ఎస్ఐఆర్ ప్రక్రియను బలవంతంగా అమలు చేయడం అని విమర్శిస్తూ, దానిని నోట్ల రద్దు, కొవిడ్ లాక్‌డౌన్ సమయాలతో పోల్చారు. బీఎల్వోల మరణాలపై ఎన్నికల కమిషన్ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ చీఫ్ ప్రశ్నించారు. బిజెపి దొంగతనం ద్వారా అధికారాన్ని వినియోగించుకోవడంలో బిజీగా ఉంది, భారత ఎన్నికల కమిషన్ ఈ దృశ్యాన్ని మౌనంగా చూస్తోంది. ఎటువంటి ప్రణాళిక లేకుండా తొందరపడి, బలవంతంగా ఎస్ఐఆర్ అమలు చేయడం వల్ల నోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్ జ్ఞాపకాలు తిరిగి వస్తున్నాయి" అని ఖర్గే అన్నారు.

బీజేపీ ఓట్ల దొంగతనం ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. పనిభారంతో బీఎల్వోలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వాస్తవ నివేదికల కంటే ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ఈ కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు? అని ఆయన పోస్ట్ చేశారు.

బిజెపి అధికార దాహం వల్లే

బిజెపి ‘అధికార దాహం’ ఫలితంగానే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఖర్గే ఆరోపించారు. ప్రస్తుతం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రజలు తమ గళాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార దుర్వినియోగం ద్వారా సంస్థలను పీడించడం, రాజ్యాంగాన్ని ముక్కలు చేయడం, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం, ఇది బీజేపీ అధికారం దాహానికి ప్రతిరూపం. ఇక చాలు. మనం ఇంకా మేల్కొనకపోతే, ప్రజాస్వామ్యం చివరి స్తంభాలు కూడా కూలిపోకుండా ఖాయం, వాటిని ఎవరూ రక్షించలేరని వాపోయారు.ఎస్ఐఆర్, ఓట్ల దొంగతనంపై మాట్లాడని వారందరూ కూడా ఈ మరణాలకు బాధ్యులేనని ఖర్గే వ్యాఖ్యానించారు.

ఆరు రాష్ట్రాల్లో 16 మంది

ఆరు రాష్ట్రాల్లో 16 మంది బిఎల్వోలు మరణించారు, వాటిలో గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో నలుగురు చొప్పున, పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురు, రాజస్థాన్‌లో ఇద్దరు, తమిళనాడు, కేరళలో ఒక్కొక్కరు మరణించారు. పశ్చిమ బెంగాల్‌లో బిఎల్వోల మరణం రాజకీయ వివాదానికి దారితీసింది. పశ్చిమ బెంగాల్‌లో బీఎల్వో శాంతి ముని ఎక్కా ఒత్తిడిని భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మరణాన్ని వివరంగా పరిశీలిస్తామని గవర్నర్ సివి ఆనంద బోస్ ఆదివారం అన్నారు. సీఎం చేసిన వ్యాఖ్యలు సహా అన్ని విషయాలు పూర్తిగా పరిశీలించాలి. ఎన్నికల సంఘానికి తగిన బలం ఉంది. తొందరపాటుకు అవసరం లేదు. దేశానికి ముఖ్యమైనవి స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలే అని అన్నారు.

బీఎల్వోల మరణాలపై బీజేపీపై ఖర్గే ఫైర్ - Tholi Paluku