Let's talk: editor@tmv.in
బీఎల్వోలే ఎన్నికల ప్రక్రియకు వెన్నెముకలాంటివారు: సీఈసీ

బీఎల్వోలే ఎన్నికల ప్రక్రియకు వెన్నెముకలాంటివారు: సీఈసీ

Pinjari Chand
28 డిసెంబర్, 2025

భారత ఎన్నికల వ్యవస్థలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు ఎన్నికల యంత్రాంగానికి వెన్నెముకలాంటివారని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కుమార్ అన్నారు. అధికారిక కార్యక్రమాలు, క్షేత్రస్థాయి ఎన్నికల సిబ్బందితో పరస్పర చర్చల భాగంగా ఆయన రెండు నుంచి మూడు రోజుల పాటు ఒడిశాలో పర్యటించనున్నారు.

భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడిన జ్ఞానేశ్ కుమార్ కుమార్, నేను నా కుటుంబంతో కలిసి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించేందుకు, స్థానిక సంస్కృతిని తెలుసుకునేందుకు, అలాగే మా బూత్ లెవల్ అధికారులను కలవడానికి ఒడిశాకు వచ్చాను. ఎన్నికల ప్రక్రియకు వారు వెన్నెముక లాంటివారు. మేము ఇక్కడ రెండు నుంచి మూడు రోజులు ఉంటామని తెలిపారు.

రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణను మరింత బలోపేతం చేయడంపై భారత ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టిందనడానికి ఈ పర్యటన నిదర్శనంగా నిలుస్తోంది. పర్యటన సందర్భంగా జ్ఞానేశ్ కుమార్ కుమార్ ఎన్నికల అధికారులు, బీఎల్వోలతో సమావేశమై ఎన్నికల సన్నాహకాలు, ఆపరేషనల్ సవాళ్లు, ఓటరు సేవలు, ఓటరు జాబితాల నిర్వహణపై సమీక్షించనున్నట్లు సమాచారం.

ఇదివరకే శుక్రవారం న్యూఢిల్లీ లోని నిర్వచన్ సదన్‌లో భారతదేశానికి వచ్చిన ఇండోనేషియా రాయబారి ఇనా హెచ్. కృష్ణమూర్తితో జ్ఞానేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశం ఆయన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా, అలాగే ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమాక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (అంతర్జాతీయ ఐడియా) చైర్‌పర్సన్‌గా నిర్వహించినట్లు ఎన్నికల సంఘం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

డిసెంబర్ 3న జ్ఞానేశ్ కుమార్ 2026 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఐడియా కౌన్సిల్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఇటీవలి వారాల్లో ఆయన పలు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి సమీక్షలు, అధికారులతో చర్చలు నిర్వహిస్తున్నారు. గత శనివారం హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, బూత్ లెవల్ అధికారులను కలసి ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసే చర్యలపై చర్చించారు. అనంతరం శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించి శివ పార్వతుల ఆశీస్సులు పొందారు.

ఇదిలా ఉండగా, 2026లో ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం సన్నాహక కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది. డిసెంబర్ 19న తమిళనాడుకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 5.43 కోట్లకు పైగా ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం అనంతరం, తుది ఓటరు జాబితాను 2026 ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

బీఎల్వోలే ఎన్నికల ప్రక్రియకు వెన్నెముకలాంటివారు: సీఈసీ - Tholi Paluku