
బీఎల్వోలకు రక్షణ కల్పించండి: సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్2.0) పక్రియలో పని చేస్తున్న బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు), ఇతర అధికారులకు స్థానిక నాయకులు, గుండాలు బెదిరింపులు, అడ్డంకులు కల్పిస్తున్నారని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని ఎన్నికల సంఘం తక్షణం అరికట్టకపోతే అరాచకం చెలరేగే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ ఎస్ఐఆర్ పని క్షేత్ర స్థాయిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా జరగాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోతే లేదా బీఎల్వోలకు రక్షణ కల్పించకపోతే ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సహకారం, రక్షణ అందించాల్సి ఉంది. అలా చేయకపోతే స్థానిక పోలీసులను డెప్యూటేషన్‌పై తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా పరిస్థితి మెరుగుపడకపోతే కేంద్ర బలగాలను రప్పించక తప్పదని వాదించారు.
కేంద్ర బలగాలను మోహరించాలి
దీనికి జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు పోలీసులను మీ అధీనంలోకి తీసుకోలేరని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి చాలా తీవ్రమైనది. దీన్ని అరికట్టండి, లేకపోతే అరాచకం చెలరేగుతుందని సీజేఐ సూర్యకాంత్ ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు. పిటిషనర్ సనాతనీ సంఘ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వి వి. గిరి పశ్చిమ బెంగాల్‌లో బీఎల్వోలు ఎస్ఐఆర్ పని చేస్తుండగా హింస, బెదిరింపులు జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నికల ఫలితాలు ప్రచురించే వరకు రాష్ట్ర పోలీసులను ఎన్నికల సంఘం డెప్యూటేషన్‌లో పెట్టాలి, అవసరమైతే కేంద్ర బలగాలను కూడా మోహరించాలని కోరారు.అయితే ధర్మాసనం ఈ వాదనను పూర్తిగా అంగీకరించలేదు.
జస్టిస్ బాగ్చీ మాట్లాడుతూ మీరు చూపిన ఆధారాల్లో ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ మాత్రమే ఉంది. మిగతావి వార్తాపత్రికల కథనాలు, ఊహాజనిత ఆరోపణలు మాత్రమే. ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ ఆధారంగా పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే కేంద్ర బలగాలు పంపాలని లేదా దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులను ఎన్నికల సంఘం అధీనంలో పెట్టాలని ఆదేశించలేం.
పని భారమేం లేదు
ఎన్నికల సంఘం ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఘాటు లేఖ రాసినట్టు రాకేశ్ ద్వివేది తెలిపారు. బీఎల్వోలకు బెదిరింపులు, పనికి అడ్డంకులు, రాష్ట్ర ఎన్నికల కార్యాలయాన్ని ముట్టడి వంటి ఘటనలు జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. కొందరు పిటిషనర్లు బీఎల్వోలు అధిక పనిభారంతో అలసిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే కార్యాలయాన్ని ముట్టడించారని వాదించినా, ద్వివేది దాన్ని ఖండించారు. ఒక్కో బూత్‌కు గరిష్ఠంగా 1,200 మంది ఓటర్లకు మాత్రమే పరిమితి చేశాం. రోజుకు 30–35 మంది ఓటర్లు మాత్రమే (6–7 ఇళ్లు) చొప్పున తనిఖీ చేయాలి. అంత భారీ పనిభారం లేదని ఆయన అన్నారు. అయినప్పటికీ ధర్మాసనం ఇది డెస్క్ పని కాదు, ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేయాలి. అందుకే మేం రాష్ట్రాలకు మరిన్ని బీఎల్వోలను నియమించమని ఆదేశించామని స్పష్టం చేసింది.
చివరగా ధర్మాసనం ఎన్నికల సంఘం, కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది. కేవలం ఒక్క ఘటన ఆధారంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోలేం. అన్ని రాష్ట్రాల్లోనూ పరిశీలించి బీఎల్వోలకు బెదిరింపులు వచ్చినట్టు వాస్తవ ఆధారాలు ఉంటే మాకు తెలియచేయండి. తగిన ఆదేశాలు జారీ చేస్తామని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
