Let's talk: editor@tmv.in
బీఎన్‌పీ చీఫ్ తారిక్ రహ్మాన్‌తో భారత్ హై కమిషనర్ భేటీ

బీఎన్‌పీ చీఫ్ తారిక్ రహ్మాన్‌తో భారత్ హై కమిషనర్ భేటీ

Pinjari Chand
11 జనవరి, 2026

భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు కీలక దశలో ఉన్న సమయంలో, భారత్‌కు చెందిన బంగ్లాదేశ్ హై కమిషనర్ ప్రణయ్ కుమార్ వర్మ శనివారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) చైర్మన్ తారిక్ రహ్మాన్‌ను కలుసుకున్నారు. మాజీ ప్రధాని, ఆయన తల్లి ఖలీదా జియా ఇటీవల మరణించిన అనంతరం తారిక్ రహ్మాన్ అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. డిసెంబర్ 30న ఖలీదా జియా మృతి చెందడంతో బీఎన్‌పీ చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఆ నేపథ్యంలో తారిక్ రహ్మాన్ ఇటీవలే పార్టీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ భేటీ 2024 జూలైలో జరిగిన ప్రజా ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ పాలనలో జరుగుతోంది. అదే సమయంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం ‘ఎక్స్’లో బీఎన్‌పీ విడుదల చేసిన ప్రకటనలో జాతీయ స్థాయి స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని తారిక్ రహ్మాన్‌ను పార్టీ చైర్మన్‌గా నియమించినట్లు వెల్లడించింది.

బీఎన్‌పీ చైర్మన్, మాజీ ప్రధాని, జాతీయ నేత బేగమ్ ఖలీదా జియా మృతి చెందిన తర్వాత పార్టీ చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఆ ఖాళీని భర్తీ చేస్తూ తారిక్ రహ్మాన్ పార్టీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారని బీఎన్‌పీ పేర్కొంది. ఈ నియామకం పార్టీ రాజ్యాంగానికి పూర్తిగా అనుగుణంగానే జరిగిందని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది.బీఎన్‌పీ రాజ్యాంగ ప్రకారం జాతీయ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించాం. ఆ సమావేశంలో ఖాళీగా ఉన్న చైర్మన్ పదవికి తారిక్ రహ్మాన్‌ను ఏకగ్రీవంగా నియమించి అధికారికంగా బాధ్యతలు అప్పగించామని పార్టీ తెలిపింది.

ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం

2009 నుంచి అధికారంలో ఉన్న షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 2024 జూలైలో జరిగిన ఉద్యమం అనంతరం కూలిపోయింది. ఆ తరువాత బంగ్లాదేశ్ రాజకీయ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో తారిక్ రహ్మాన్ పార్టీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. రాబోయే ఫిబ్రవరిలో జరగనున్న జాతీయ ఎన్నికల నేపథ్యంలో, తారిక్ రహ్మాన్ బీఎన్‌పీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

దాదాపు 17 ఏళ్ల నిర్బంధ జీవితం తర్వాత తారిక్ రహ్మాన్ గత నెలలో బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. 2007–08 రాజకీయ సంక్షోభ సమయంలో అరెస్టయిన ఆయన, విడుదల అనంతరం లండన్‌లో నివసిస్తూ వచ్చారు. అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో తనపై నమోదైన పలు కేసుల్లో ఆయనకు విముక్తి లభించడంతో స్వదేశానికి తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. తారిక్ రహ్మాన్ స్వదేశానికి తిరిగివచ్చిన సందర్భంగా భారీగా ప్రజలు, సీనియర్ బీఎన్‌పీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇది ఎన్నికల ముందర బీఎన్‌పీ బలమైన రాజకీయ సంకేతంగా మారిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ చీఫ్ అడ్వైజర్‌గా ఉన్న తాత్కాలిక ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. గత నెలలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఢాకాలో తారిక్ రహ్మాన్‌ను కలుసుకుని, ఖలీదా జియా మృతిపై భారత ప్రభుత్వం తరఫున సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్’ ఢాకాకు వచ్చిన వెంటనే బీఎన్‌పీ యాక్టింగ్ చైర్మన్, మాజీ ప్రధాని బేగమ్ ఖలీదా జియా కుమారుడు తారిక్ రహ్మాన్‌ను కలిశాను అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాసిన వ్యక్తిగత లేఖను తారిక్ రహ్మాన్‌కు అందజేశానని కూడా ఆయన వెల్లడించారు.

భారత ప్రభుత్వం, ప్రజల తరఫున మా గాఢ సంతాపాన్ని తెలియజేశాను అని జైశంకర్ అన్నారు. ఖలీదా జియా దృష్టి, విలువలు భవిష్యత్తులో భారత్–బంగ్లాదేశ్ సంబంధాలను మార్గనిర్దేశం చేస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు. బేగమ్ ఖలీదా జియా వారసత్వం మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.

బీఎన్‌పీ చీఫ్ తారిక్ రహ్మాన్‌తో భారత్ హై కమిషనర్ భేటీ - Tholi Paluku