
బీఎంసీ మేయర్‌గా రితు తావ్డే ప్రమాణం
బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్‌గా రితు తావ్డే బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపమేయర్‌గా సంజయ్ ఘాడీ కూడా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక, బీఎంసీ ప్రధాన కార్యాలయంలో 78వ మేయర్‌గా తావ్డే బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కార్యక్రమానికి హాజరై కొత్తగా ఎన్నికైన మేయర్, ఉపమేయర్‌లను అభినందించారు. తావ్డే ఎన్నికతో దేశంలో అత్యంత ధనిక పౌర సంస్థ అయిన బీఎంసీలో 44 ఏళ్ల తర్వాత బీజేపీ మేయర్ పదవిని దక్కించుకుంది. ముంబైలో బీజేపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన రెండో వ్యక్తి ఆమె.(ముంబైలో బీజేపీ తొలి మేయర్గా డాక్టర్ ప్రభాకర్ సాయి వ్యవహరించారు.ఆయన 1982–83లో ముంబై (అప్పటికి బొంబే) మేయర్‌గా పనిచేశాడు, ఇది పార్టీ స్థాపనకు కొన్ని సంవత్సరాల తరువాత జరిగింది.)
ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధ్యక్ష అధికారి హోదాలో గగరాణి బీఎంసీ చారిత్రక కమిటీ హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముందు బీజేపీ, శివసేన కార్పొరేటర్లు హుతాత్మా చౌక్(అమరవీరుల) వద్ద పుష్పాంజలి ఘటించి అనంతరం బీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికైన సాధారణ సభ లేకపోవడంతో 2022 మార్చి నుంచి బీఎంసీ కమిషనర్ భూషణ్ గగరాణి రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రితు తావ్డే ఎన్నికను స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు. మహాయుతి ప్రభుత్వం ముంబై ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని అన్నారు. ఇద్దరూ అనుభవజ్ఞులు. బీఎంసీ ప్రజాస్వామ్యానికి కీలక భాగం. బాలాసాహెబ్ ఠాక్రే శతజయంతి సంవత్సరంలో ఆయన కలలను సాకారం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ, ముంబైని ప్రపంచ స్థాయి ఫిన్‌టెక్ రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రధాని మోడీ దృష్టికోణాన్ని అమలు చేస్తూ నగరాభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ముంబై బీజేపీ అధ్యక్షుడు అమిత్ సాతమ్ మాట్లాడుతూ బీఎంసీలో బీజేపీకి చెందిన మేయర్ పదవిలోకి రావడం విశేషమని అన్నారు. పారదర్శక, అవినీతి రహిత పాలనకు ముంబై ప్రజలు మహాయుతికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. మహారాష్ట్ర శాసన మండలి సభ్యురాలు చిత్రా కిశోర్ వాఘ్ కూడా రితు తావ్డే ఎన్నికపై ఆనందం వ్యక్తం చేశారు.
రితు తావ్డే బీఎంసీ 132వ వార్డు (ఎన్-వార్డు, ఘాట్కోపర్)కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ బీజేపీ కార్పొరేటర్. 227 సభ్యుల బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, మిత్రపక్షమైన శివసేన 29 స్థానాలు గెలుచుకుంది.
1997 నుంచి 25 సంవత్సరాల పాటు బీఎంసీని పాలించిన శివసేన (యూబీటీ) ఈసారి 65 స్థానాలు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆరు స్థానాలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి.
