Let's talk: editor@tmv.in
బీఎంసీ మేనిఫెస్టో విడుదల చేసిన థాకరేలు

బీఎంసీ మేనిఫెస్టో విడుదల చేసిన థాకరేలు

Pinjari Chand
5 జనవరి, 2026

త్వరలో జరగబోయే బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ థాకరే కలిసి తమ సంయుక్త ఎన్నికల మేనిఫెస్టో ‘వచన్ నామా’ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శివసేన భవన్‌లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మేనిఫెస్టో కవర్‌పై శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరేతో పాటు థాకరే సోదరుల ఫోటోను ఉంచారు. 2005లో శివసేన నుంచి విడిపోయిన అనంతరం దాదాపు 20 ఏళ్ల తర్వాత రాజ్ థాకరే శివసేన భవన్‌కు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

శివసేన (యూబీటీ)–ఎంఎన్‌ఎస్ కూటమి ముంబైలో అందుబాటులో ఉండే ఇంటి నిర్మాణాలు, వైద్య, ప్రజా రవాణా, విద్యా రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని హామీ ఇచ్చింది. ఇంటి పని మనుషులు, కోలి సముదాయం మహిళలకు ‘స్వాభిమాన్ నిధి’ పథకం కింద నెలకు రూ.1,500 భృతి అందిస్తామని ప్రకటించింది. అలాగే బస్సుల కనీస చార్జీని రూ.10 నుంచి రూ.5కు తగ్గించడం, కొత్త బస్సులు, మార్గాలు ఏర్పాటు చేయడం, 700 చదరపు అడుగుల వరకు ఉన్న ఇళ్లపై ఆస్తి పన్ను రద్దు, పునర్నిర్మాణ భవనాల్లో ప్రతి ఫ్లాట్‌కు ఒక పార్కింగ్ స్థలం కల్పించేలా నిబంధనల మార్పు వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.

స్పీకర్ ఓటర్లను బెదిరిస్తున్నారు

విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ అభ్యర్థులు, ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిధికి బయట అధికార దుర్వినియోగం జరుగుతోంది. దీనిపై కేసు నమోదు చేయాలని అన్నారు. ఏకగ్రీవంగా అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఓటర్ల హక్కులను దోచుకుంటున్నారని ఆరోపించిన ఉద్ధవ్ థాకరే, అటువంటి చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ థాకరే మాట్లాడుతూ, మహాయుతి కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరు. మహారాష్ట్ర రాజకీయాలను యూపీ, బిహార్ తరహాలోకి మార్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముంబై, పుణే, పింప్రి–చించ్వడ్ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఏకగ్రీవంగా గెలిచిన వార్డుల్లో ఎన్నికలు రద్దు చేసి పోలింగ్ నిర్వహించాలి

అధికార పార్టీలకు చెందిన అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచిన మున్సిపల్ వార్డుల్లో ఎన్నికలను రద్దు చేసి, మళ్లీ పోలింగ్ నిర్వహించాలని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)ను డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం ఇప్పుడు ‘గుంపుల పాలన’గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో మేయర్ తప్పనిసరిగా మరాఠీ వాడే అయి ఉండాలని రాజ్ థాకరే స్పష్టం చేశారు. మరాఠీ భాషకు గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ 2022 జూన్‌లో తమ ప్రభుత్వం కూలిపోయి ఏకనాథ్ షిండే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఎంసీ నిధులను కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. బీఎంసీ వార్షిక వ్యయ బడ్జెట్ రూ.15 వేల కోట్లైతే, పనుల కోసం కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ మొబిలైజేషన్ పేరుతో రూ.3 లక్షల కోట్ల వరకు అవసరం అవుతోందని చెప్పారు. ఇది రూ.3 లక్షల కోట్ల కుంభకోణమని, అందులోని కిక్‌బ్యాక్ డబ్బును మున్సిపల్ ఎన్నికల్లో వినియోగిస్తున్నారని ఆరోపించారు.

యువత ఓటు హక్కును కోల్పోతోంది

జనవరి 15న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ–మహాయుతి కూటమి 68 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుందని ఉద్ధవ్ థాకరే గుర్తు చేశారు. ఓట్ల దోపిడీ తర్వాత ఇప్పుడు అభ్యర్థులనే దోచుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ధైర్యం ఉంటే ఏకగ్రీవంగా గెలిచిన వార్డుల్లో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏకగ్రీవ ఎన్నికల వల్ల ముఖ్యంగా యువత (జెన్‌జీ) ఓటు హక్కును కోల్పోతున్నారని ఆయన అన్నారు. రాజ్ థాకరే మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని పాలక కూటమికి హెచ్చరిక చేశారు. బీజేపీ ప్రమాదకరమైన సంప్రదాయానికి శ్రీకారం చుడుతోందన్నారు. భవిష్యత్తులో మరింత పద్ధతిగా ఇదే పద్ధతిని ఇతరులు పాటించినప్పుడు పాలకులు ఫిర్యాదు చేయరాదన్నారు. పశ్చిమ బెంగాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ విజయాలపై బీజేపీ సుప్రీంకోర్టుకు వెళ్లిందని గుర్తు చేసిన రాజ్ థాకరే, ఇప్పుడు మహారాష్ట్రలో అదే పరిస్థితిపై బీజేపీ వైఖరి ఏమిటని ప్రశ్నించారు.

ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారని, నామినేషన్ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని, సీసీటీవీ ఫుటేజ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. స్పీకర్ పదవిలో ఉండి పార్టీ పక్షపాతం చూపరాదని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

విచారణకు ఆదేశం

ఈ అంశంపై బీఎంసీ కమిషనర్ భూషణ్ గగరాణీ నుంచి పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. కొలాబా నియోజకవర్గంలోని 225, 226, 227 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించలేదన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ వార్డుల్లో నర్వేకర్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల్లో మొత్తం 2,869 స్థానాలకు, 893 వార్డుల్లో పోటీ జరుగుతోంది. ముంబైలో మాత్రమే 227 సీట్లు ఉండగా, మిగతా కార్పొరేషన్లలో బహుళ సభ్యుల వార్డులు ఉన్నాయి.