
బీఎంసీ బడ్జెట్ విడుదల
బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 80,952.56 కోట్ల బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టింది. ఇందులో మూలధన వ్యయం (క్యాపెక్స్) రూ. 48,164.28 కోట్లుగా ప్రతిపాదించింది. ఇది 2025-26తో పోలిస్తే సుమారు 11.59 శాతం పెరుగుదలగా ఉండటం విశేషం. మౌలిక వసతులు, ప్రత్యేక ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్న సంకేతంగా ఈ పెంపును భావిస్తున్నారు. బీఎంసీ కమిషనర్ భూషణ్ గాగ్రాని బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సర అంచనా రూ. 74,427.41 కోట్లతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్ 8.77 శాతం అధికం.
2025-26లో మూలధన వ్యయం మొదట రూ. 43,162.23 కోట్లుగా అంచనా వేసినప్పటికీ, దాన్ని రూ. 39,159.51 కోట్లకు సవరించారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి వాస్తవ మూలధన వ్యయం రూ. 22,425.16 కోట్లుగా నమోదైంది. 2026-27లో ప్రధాన మౌలిక వసతుల కోసం రూ. 30,069.89 కోట్లు కేటాయించారు. కోస్టల్ రోడ్, గోరేగావ్-ములుండ్ లింక్ రోడ్ (జీఎంఎల్ఆర్), మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీస్) తదితర ప్రాజెక్టులకు రూ. 13,990 కోట్లు ప్రతిపాదించారు. ప్రత్యేక ప్రాజెక్టులకు రూ. 4,104.39 కోట్లు కేటాయించారు. అంతర్గత తాత్కాలిక బదిలీలు రూ. 13,765.74 కోట్లుగా అంచనా వేశారు.
ఆదాయ పరంగా 2026-27లో మొత్తం ఆదాయం రూ. 51,510.94 కోట్లుగా అంచనా వేసింది. ఇది 2025-26 బడ్జెట్ అంచనాతో పోలిస్తే 19.35 శాతం అధికం. ఆక్ట్రాయ్ రద్దుకు పరిహారం రూపంలో రూ. 15,550.02 కోట్లు లభిస్తాయని అంచనా. డెవలప్మెంట్ ప్లాన్ (డీపీ) ఫీజులు రూ. 12,050 కోట్లు, ఆస్తి పన్ను రూ. 7,000 కోట్లు వసూలవుతాయని బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నారు. నీరు, మురుగునీటి చార్జీలు, పెట్టుబడులపై వడ్డీ, పర్యవేక్షణ చార్జీలు, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు వంటి వనరుల నుంచి కూడా గణనీయమైన ఆదాయం లభించనుంది. మొత్తం మీద 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 89.84 కోట్ల మిగులు ఉంటుందని బీఎంసీ అంచనా వేసింది. ఇది గత ఏడాది అంచనాతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ.
